జనసేన సిద్ధాంతాలను విశ్వసించే నడిచినవారితో సంస్థాగత నిర్మాణం
జనసేన అనేది నిరంతర ప్రవాహంలా కళ కళ లాడాలి
ఆంధ్రప్రదేశ్ కు భావి నాయకత్వం అందించే ప్రక్రియకు శ్రీకారం
రాష్ట్రంలో కులాల మధ్య చిచ్చుపెట్టే కుట్రలు పథకం ప్రకారం సాగుతున్నాయి
ఆ కుట్రలు చేస్తున్నవారిపట్ల అప్రమత్తంగా ఉండాలి
వైసీపీకి ప్రజలు 11 సీట్లు ఇచ్చినా వారి నైజం మారలేదు
రాజకీయాలకు కులాన్ని ముడిసరకుగా వాడుకోను
అన్ని కులాల ఆమోదంతోనే చరిత్ర సృష్టించగలం
యువతకు ఉచితాలు కాదు.. గౌరవమైన జీవనం కావాలి
జనసేన పార్టీ సంక్షేమ పథకాలకు ఎప్పుడూ వ్యతిరేకం కాదు
ప్రజాస్వామ్యయుతంగా జనసేన పార్టీ నిర్మాణం
ప్రతి విషయంపైనా నాయకులు బలంగా మాట్లాడాల్సిందే
జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీల కార్యాచరణ సమావేశంలో నాయకులకు దిశానిర్దేశం చేసిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు
దేశంలో ఎంతో మంది రాజకీయ పార్టీలు పెట్టారు. ప్రత్యేక కారణాలతో కొన్ని.. సిద్ధాంతాలు, భావజాలంతో మరికొన్ని నెలకొల్పి ఉండొచ్చు. జనసేన పార్టీ మాత్రం పార్టీ సిద్ధాంతానికి కట్టుబడిన బలమైన సమూహంతో మూలాలను బలపర్చుకోవాలని మొదటి నుంచి భావించాను. పుష్కర కాలంపాటు నాతో నడిచి, పార్టీ సిద్ధాంతాల కోసం తపనపడిన సమూహంతో ఇప్పుడు పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేస్తున్నాను. ఏదో రకంగా కమిటీలను వేసి, పార్టీని నడిపించడం పెద్ద కష్టం కాదు.. కానీ జనసేన పార్టీ నాయకత్వం, కార్యకర్తలు సిద్ధాంతాల కోసం కడదాకా నిలబడేలా ఉండాలని భావించాన’ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అన్నారు. జనసేన ప్రస్థానం చిన్న కాలువ మాదిరి ప్రారంభం అయింది.. నేడు వాగు ప్రవాహం మాదిరిగా విస్తరించింది.. అది మరింత ఉదృతమై నిత్య ప్రవాహంతో కళకళలాడాలని ఆకాంక్షించారు. జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీల కార్యాచరణ సమావేశం శనివారం మంగళగిరిలో జరిగింది.
ఈ సమావేశంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ‘‘రాజకీయ పార్టీ జీవన కాల మనుగడకు బలమైన సిద్దాంతాన్ని నమ్మే ముడిసరకు కావాలి అనే మొదట్లోనే అనుకున్నాను. అది పార్టీకి పునాదిగా ఉపయోగపడుతుంది. ఓ వ్యక్తి బలమైన ఆలోచన నుంచే వ్యవస్థ తయారవుతుంది. తర్వాత ఆ వ్యవస్థ ఎంతోమందిని తయారు చేస్తుంది. విజయాలకు, అపజయాలకు అతీతంగా కాలాన్ని ఎదురించి మరీ నాకు అండగా నిలబడిన నా సమూహానికి ధన్యవాదాలు. పార్టీకి 22 లక్షల మంది ఉద్యమిలను తయారు చేయడానికి, 18 వేల మంది సాధక్స్ నిరంతరం శ్రమించారు.
ఎందరో ఆశలకు ప్రతిరూపం జనసేన
నా ఆశయాలు, సిద్ధాంతాలు, భావజాలం చాలామందికి నన్ను దగ్గర చేస్తాయి. జనసేన పార్టీ ఎందరో మధ్యతరగతి వ్యక్తుల ఆశలు, ఆశయాలకు ప్రతిరూపంగా నిలుస్తుంది. కారు డ్రైవర్ గా పనిచేసే యువకుడు, టీ దుకాణం నడిపే వ్యక్తి, చెప్పులు కుట్టే సగటు మనిషి, మార్పు కోసం చూసే ఓ విశ్రాంత ఉద్యోగి, రోజువారీ కూలీ, ఓ ఆటోడ్రైవర్ ఇలా… ఎందరో జనసేన పార్టీని తమ సొంత పార్టీ అనుకుంటారు. సగటు మధ్యతరగతి వారి కోపం, ఆవేశం, ఆవేదన బలంగా ఉంటుంది కాబట్టే నన్ను ప్రతి ఒక్కరూ ఇంట్లోని వ్యక్తిగా అనుకుంటారు. నా గురించి ప్రసార మాధ్యమాల్లో ఏదైనా వస్తే వెంటనే అటెన్షన్ గా చూస్తారు.. వింటారు. నా భావజాలాన్ని అర్థం చేసుకునే పదిమంది అప్పట్లోనే ఉన్నట్లయితే కోటి మంది ఉద్యమిలను తయారు చేసేవాళ్లం.
11 సీట్లు వచ్చినా వైసీపీ ఏమీ మారలేదు
మీకు అధికారం ఉన్నప్పుడు మీరు ఇష్టానికి తిట్టేసి ఇప్పుడు జ్ఞానోదయం కలిగిందా భాష గురించి ? సరే ఇప్పటికైనా బుద్ధి వస్తే సంతోషం, మీరు మమ్మల్ని తిట్టకుండా ఉంటే మా పార్టీ నిర్మాణానికి చాలా సమయం ఉంటుంది. మీకు బదులు ఇవ్వడం మానేసి మా పార్టీ నిర్మాణం పైనే దృష్టి మొత్తం పెట్టుకుంటాం. కాదూ కూడదూ.. మీరు తిట్టాల్సిందే అంటే మిమ్మల్ని తిట్టి మేము బలపడతాం. ఏదైనా మేము బలపడటం గ్యారెంటీ. అధికారం పోయినా, 11 సీట్లకే పరిమితం అయినా ఇంకా ఇష్టానికి నోటికొచ్చినట్టు దూషిస్తున్నారు. అది గొప్పతనం వైసీపీ వాళ్ళలో. నోటికొచ్చినట్లు మాట్లాడటంలో వాళ్ళ నిబద్ధతను అభినందించాల్సిందే. 11 వచ్చినా భాష విషయంలో మేము తగ్గం అంటున్నారు. తగ్గకండి మీకు 1 వచ్చినా తగ్గకండి అలాగే ఉండండి.
మన ఎమ్మెల్యే శ్రీ పంతం నానాజీ గారి ప్రాంతానికే చెందిన అప్పటి ఒక ఎమ్మెల్యే ఏం మాట్లాడారు? మేము మర్చిపోయాం అనుకుంటున్నారా? అంటే మీరు అధికారం ఉన్నప్పుడు మీ ఇష్టానికి మాట్లాడేస్తారా? ఇటీవల నా మీద వైసీపీ నాయకులు చేసిన వివిధ రకాల కామెంట్లకు కౌంటర్ ఇస్తూ మొన్న నానాజీ గారు మాట్లాడింది చూసాను. ఆయనని ఏదో ఎక్కువ మాట్లాడారు అని వైసీపీ వాళ్ళు అంటున్నారు. మీరు ఎంత ఎక్కువ మాట్లాడారో చెప్పాలా? మీరు మాట్లాడిన వీడియోలు మీకు పంపాలా? నానాజీ గారు మాట్లాడిన దాన్ని ఎంకరేజ్ చెయ్యం, కాకపోతే మీరు ఎంత దారుణమైన భాష మాట్లాడారో గుర్తు చేసుకోండి. పాలసీపరంగా మేము మాట్లాడితే – వ్యక్తిగత విమర్శలు చెయ్యడం, వ్యక్తిత్వ హననం చేసేలా వైసీపీ మాట్లాడుతున్నారు. అలాంటి మాటలకు గట్టిగా సమాధానం ఇవ్వక తప్పదు. మౌనంగా ఉన్నామంటే ఒక్కోసారి పేట్రేగిపోతారు. కాబట్టి మనం కూడా కొన్ని సందర్భాల్లో ధీటుగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. సాక్షాత్తూ గౌరవ ముఖ్యమంత్రి గారి భార్యనే అనకూడని మాటలు అన్నారు. ఇప్పుడు మీరు మమ్మల్ని తిట్టినా మేం బలంగా ఎదుర్కొంటాం.. బలపడతాం. మీరు తిట్టకపోయినా పదునైన భావజాలంతో మరింత రాటుదేలుతాం. ఎలా అయినా జనసేన పార్టీ బలపడుతుంది.
యువత ఉచితాలు అడగటం లేదు
నేను హుద్ హుద్ తుపాను సమయంలో శ్రీకాకుళంలో పర్యటించినపుడు ఓ యువకుడు అన్న మాట నాకు ఎప్పటికీ గుర్తుంటుంది. మాకు 10 కేజీల బియ్యం కాదు.. 25 ఏళ్ల భవిష్యత్తు ఇవ్వండని కోరాడు. ఈనాటి యువత ఉచితాలు అడగటం లేదు. వారికి గౌరవమైన జీవనం ఇవ్వాలని కోరుతున్నారు. జనసేన పార్టీ సంక్షేమ పథకాలకు ఎప్పుడూ వ్యతిరేకం కాదు. కానీ సంక్షేమ పథకాలతోనే ఓట్లు వస్తాయి… ప్రభుత్వాన్ని నడిపేద్దాం అనుకుంటే మాత్రం తప్పు. వైసీపీ అలా అనుకునే బోర్లాపడింది. బటన్లు నొక్కాం అనే పేరుతో వైసీపీ హయాంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో కనీస సౌకర్యాలు, వసతులను పట్టించుకోలేదు. రోడ్లు నిర్మించలేదు. ఇప్పుడు మళ్లీ వాటిని సరిదిద్దడానికి తపన పడుతున్నాం. వ్యవస్థలు బలోపేతం కావాలని మేం కోరుకుంటున్నాం. సంక్షేమ పథకాల కోసమే ప్రభుత్వం నడిపితే ప్రజలకు అవసరం అయ్యే విద్య, వైద్యం, ఇతర మౌలిక సదుపాయాలన్నీ గాలిలో దీపాలుగా మారుతాయి. కూటమి ప్రభుత్వంలో రోడ్లను వేస్తున్నాం. గత ప్రభుత్వంలో అస్తవ్యస్తం అయిన ప్రతి వ్యవస్థకు పునరుజ్జీవం పోస్తున్నాం. ప్రాధాన్యత పరమైన సంక్షేమం మంచిదే. కానీ బడ్జెట్ దేనికోసం కేటాయించాలి..? దేనికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలనే విషయాలను జనసేన నాయకులు ప్రజల్లో అవగాహన తెచ్చేలా పనిచేయాలి. నాయకుడు ప్రజల భావం మాట్లాడాలి. ప్రజలకు ఏది అవసరమో దానిపై మాట్లాడాలి.
ప్రజాస్వామ్యబద్ధంగా జనసేన పార్టీ నిర్మాణం
జనసైనికులు, వీర మహిళలే పార్టీకి సారథులు. క్యాడర్ టూ లీడర్షిప్ లో భాగంగా 28 మందితో సమాచార సేకరణ కమిటీలను నియమిస్తున్నాం. పార్టీ కోసం పనిచేయడానికి సిద్దంగా ఉన్న ప్రతి ఒక్కరి నుంచి ప్రత్యేక ఫార్మాట్ ప్రకారం సమాచారం సేకరించి, వీరు నా ముందుకు తీసకొస్తారు. పార్టీ కోసం ఎప్పటి నుంచి పనిచేస్తున్నారు..? ఏ కార్యక్రమాలు చేశారు..? ఎలాంటి ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్నారు..? చేసిన సేవలు ఏంటీ..? ప్రజలతో ఎలా మమేకం అవుతారు..? అనే అన్ని రకాల విషయాలను బేరీజు వేసి, బాధ్యతలను అప్పగించడం జరుగుతుంది. బాధ్యతలను కూడా పార్టీ కార్యకర్తల సమక్షంలోనే మీరు చెప్పిన విధంగానే పూర్తి పారదర్శకంగా నియామకం చేస్తాం. 28కి అదనంగా పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి మరో 5 మంది బృందాన్ని పంపుతున్నాను. పార్టీ కోసం ఏళ్ల తరబడి పనిచేస్తున్న కిందిస్థాయి కార్యకర్తలను కనీసం గుర్తించకపోతే పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడం ఎలా సాధ్యం..? అనే ఆలోచన నుంచే ఈ కార్యక్రమం అంకురించింది. ప్రతి ఒక్కరికీ ప్రాధాన్యం ఇవ్వాలని, బాధ్యతలు అప్పగించడానికి ఓ ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తాం. పార్టీ కార్యకర్తల సమక్షంలో, పార్టీ కార్యకర్తలే నాయకుల్ని పారదర్శకంగా, ప్రజాస్వామ్యయుతంగా ఎంపిక చేసే విధానం ఇది. సమాచార సేకరణ కమిటీలు జాగ్రత్తగా సేకరించే సమాచారంతోనే ఆంధ్రప్రదేశ్ భావినాయకత్వం అన్ని స్థాయిల్లోనూ వస్తుంది. బలమైన వ్యవస్థలను నిర్మించాలంటే బలమైన వ్యక్తుల సమూహం కావాలి.
కులాన్ని రాజకీయ పెట్టుబడిగా వాడుకోను
కులం సామాజిక చిత్రపటం. కులాన్ని నేను మార్చాలని ప్రయత్నం చేయను. సరిదిద్దాలని ప్రయత్నం చేయను. కులాల ఐక్యత గురించి ఎందుకు మాట్లాడతానంటే… నేనెప్పుడూ కులం కార్డు తీసుకొని రాజకీయాలు చేయను. నాకు దేశం, రాష్ట్రం బాగుండాలి. మానవత్వం చచ్చిపోకూడదు అని ఉంటుంది. కులం ఎప్పుడూ ఇంటి గడప దాటకూడదు. కులాల గురించి ఎందుకు మాట్లాడతానంటే.. మిగిలిన వారు దిగజారి మాట్లాడినప్పుడు మాత్రమే దాన్ని సరిజేయాలని మాట్లాడుతాను.
నా కోరిక ఏమిటంటే దేశంలో ఎప్పటికైనా బీసీ, ఎస్సీ, ఎస్టీ పేరుతో వసతి గృహాలు కాకుండా, పిల్లలందరికీ ఒకే వసతిగృహం ఉండాలని కోరుకుంటాను. రాజకీయాలు కులాలకు అతీతంగా నడవాలి. ఎవడో ఒకడు దీనికోసం ముందుకు రావాలి. కులాలను కలిపేలా మాట్లాడాలి తప్పితే విడగొట్టడానికి కాదు. పవన్ కళ్యాణ్ ఎప్పటికీ కులాన్ని రాజకీయ పెట్టుబడిగా వాడుకోడు
బీసీలు ఐక్యంగా ఉండాలి
ఇటీవల రాజమండ్రిలో బీసీ నాయకులు కొందరు నాతో సమావేశం ఏర్పాటు చేశారు. మేం జనాభాలో 50 శాతం పైగా ఉన్నాం..మాకు అవకాశాలు కల్పించండి అని అడిగారు. అసలు మీకు అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఏంటీ..? మీరు గొడవలు, ఇతర విషయాలప్పుడు ఉండే ఐక్యతను ఓట్లు వేసేటపుడు ఎందుకు చూపించరు..? బీసీలంతా ఐక్యంగా ఉంటే వేరొకరిని అడగాల్సిన అవసరం ఏముంది. మీరంతా ఐక్యంగా ఉంటే మీ దగ్గరకు రాజకీయ నాయకులు వచ్చి ఎన్ని సీట్లు కావాలో చర్చించాలి కదా..? నాయకులు ఎలా ఉండాలంటే అన్ని కులాలకు ఆమోదయోగ్యంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ ఆనందంగా ఆమోదించేలా ఉండాలి. జనాభాలో అధికంగా ఉండే కులాలను కొందరు నాయకులు రాజకీయ మూలధనంగా ఉపయోగించుకుంటున్నారు. మీరు నమ్మే నాయకుడు మీ కులాన్ని సాధికారత వైపు తీసుకెళ్తున్నారా లేదా అనేది ప్రజలు ఆలోచించాలి. బీఎస్పీ పార్టీ కాన్షీరాం గారి నాయకత్వంలో ఒకప్పుడు అతి పెద్ద సామాజిక ఉద్యమం నడిపింది. ఎంతోమందికి రాజకీయ స్వరం అయింది.
అయితే ఏ ఉద్యమం అయినా, ఏ రాజకీయ ప్రయాణం అయినా ఓ సామాజిక వర్గానికే పరిమితమై ముందుకు వెళితే దాని ఎదుగుదలకు పరిమితులు ఏర్పడతాయి. నాయకుడు ఎప్పుడూ అన్ని కులాలను నమ్మాలి. అధికారానికి దూరంగా ఉన్న కులాలను అధికారానికి తీసుకురావడం అంటే రాజకీయ విజయం. అన్ని వర్గాలను ఆమోదించే నాయకత్వం తీర్చిదిద్దడం సామాజిక విజయం. నేను సామాజిక విజయం వైపు వెళ్తున్నాను. ఎవరు అధికారంలోకి వచ్చినా మనకేం కాదు అని ప్రజలు భావించడమే పెద్ద విజయం.
కాపులను నెగెటివ్ గా చూపించే పథకం
అధికారం తమ చేతిలోనే ఉండాలనే 10 మందితో కూడిన గుంపు ఉంటుంది. అది కులాలకు అతీతం. అధికారం వారి చేతిలోనే ఉండాలని వీరు కోరుకుంటారు. వైసీపీ అనగానే ఓ సామాజిక వర్గానికి చెందిన గుంపు కాదు… అధికారం కోసం దేనికైనా, ఏదైనా చేసే గుంపు అది. కులాన్ని, మతాన్ని, ప్రాంతాన్ని, ఇతర ఎన్నో రకాల విషయాలను వాడతారు. కానీ అధికారం మాత్రం కోల్పోకూడదు అనుకుంటారు. వైసీపీ నుంచి వచ్చిన శ్రీ బాలినేని శ్రీనివాస రెడ్డి గారు కానీ, శ్రీ సామినేని ఉదయభాను గారి కానీ ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారు అంటే ఆ పార్టీ వెళ్లే దారి రైట్ కాదు అని వారికి అర్థం అయింది.
కాపులను కాపులతోనే తిట్టించడం ఓ స్ట్రాటజీ అయితే, క్రిమినల్ అయిన ఓ రౌడీకి కులం రంగు వేసి దాన్ని రాజకీయం చేసి, క్రిమినల్ కు మద్దతు ఇవ్వడం వీరి నైజం. చిన్నపుడు ఓ సామెత ఉంది. నీ స్నేహితుడు ఎవరో తెలిస్తే నీవు ఎలాంటి వాడివో తెలుసుకోవచ్చు అని.. ఇప్పుడు వైసీపీ నాయకుడు ఎలాంటి వాడో తెలిస్తే, ఆ పార్టీలో నాయకులు ఎలాంటి వారో అర్థం అవుతుంది.
కాపు కులానికి నాయకులతో బూతులు తిట్టిస్తారు. క్రిమినల్ యాక్టివిటీ చేసిన వ్యక్తి కులం కాపు అని పదేపదే చెబుతారు. అలా కాపులను నెగెటివ్ గా ప్రొజెక్ట్ చేసే కుట్ర సాగుతోంది. కాపు కులానికి వ్యక్తులు చేసే నేర పనులను పదేపదే వీరితో చెప్పించడం వల్ల ప్రతి కులంలోని వారికి వారి వారి మనోగతంలో కాపులపట్ల నెగెటివ్ ముద్ర వేయడానికి పథకం ప్రకారం చేస్తున్న కుట్ర ఇది. ఇది స్పష్టంగా ఓ పార్టీ చేస్తున్న రాజకీయ క్రీడ ఇది. కక్షపూరితంగా కొన్ని కులాలను అందరి దగ్గర విలన్లు చేసేందుకు ఆడుతున్న ఆట ఇది. ప్రతిసారీ దాన్ని నేను చాలా స్పష్టంగా ప్రజలకు అర్ధం అయ్యేలా చెబుతాను.. చైతన్యవంతం చేస్తాను కాబట్టే నేనంటే వారికి కోపం… భయం.
కొందరు ప్రాంతీయతలను తీసుకొచ్చి విద్వేషాలు రెచ్చగొడుతుంటే, దేశంలోని అంతర్భాగమే కదా అని నేను గుర్తుచేసినందుకు నన్ను తిడుతున్నారు. నేను తెలంగాణను ఎప్పుడూ వ్యతిరేకించలేదు. నేను ప్రతి నాయకుడి డీఎన్ఏను బయటకు చెబుతాను. అందుకే నేనంటే అందుకే కోపం. దేశంలో ఓ ఒక్క వర్గం కూడా చరిత్రను మార్చలేదు. అందర్ని కలుపుకుని వెళ్లిన వారే చరిత్ర సృష్టించారు. మీరు నమ్మే నాయకుడి మాటలు మీ కులాన్ని, మీ జీవనాన్ని గౌరవించాలా ఉన్నాయా? లేవా అనేది ప్రతి ఒక్కరూ తెలుసుకోండి. మీరు నమ్మే నాయకుడిని బట్టే మీ భవిష్యత్తు ఉంటుంది. బూతులు తిట్టే నాయకులు కాబట్టే ప్రజలు వారికి 11 సీట్లు ఇచ్చారు. ఈ మధ్య శ్రీకాకుళంలో ఓ ప్రజాప్రతినిధి ఇష్టానుసారం నోటికొచ్చినట్లు బూతులు మాట్లాడితే పోలీసులు ఆయనను విచారణకు పిలిచారు. విచారణకు పిలవగానే వారికి కులం గుర్తుకొచ్చింది. బీసీలు అయిన మమ్మల్ని కావాలని అరెస్టు చేశారు అని మొదలుపెట్టారు. కులం బూతులు తిట్టమని చెప్పిందా..? తప్పులు చేసి కులాల వెనుక దాక్కుంటే నేను మాత్రం కచ్చితంగా బలంగా ఖండిస్తా.
బలంగా స్పందించాలి
తప్పును తప్పు అని చెప్పడానికి పార్టీలోని ప్రతి నాయకుడు గళం ఎత్తాల్సిందే. తెలంగాణ నాయకులు చూడండి. ప్రతి విషయం పట్ల స్పష్టంగా స్పందిస్తారు. ప్రతి విషయం మీద నేను స్పందించే వరకు వేచి ఉండే ధోరణి సరికాదు. ఎవడికి ఏ భాషలో చెప్పాలో, ఎంత శిక్షపడాలో అలాగే స్పందించాలి. ఓ మాట మాట్లాడితే తూకం వేసినంత జాగ్రత్తగా ఉండాలి. ఎదురు దాడిలా ఉండాలి. ఏం మాట్లాడితే బాగుంటుంది..? ఎలా మాట్లాడాలి..? ప్రతి విషయాన్ని తెలుసుకోండి. బేరీజు వేసుకొని, అంశాల ప్రతిపాదికన మాట్లాడండి. అన్ని విషయాలను అవగతం చేసుకోండి. అవసరం అయితే పార్టీ కేంద్ర కార్యాలయం సహాయం తీసుకోండి. సహేతుకమైన విమర్శలకు కచ్చితంగా సమాధానం చెబుతాం. తప్పులుంటే సరిజేసుకుందాం. అంతేకానీ ఇష్టానుసారం మాట్లాడితే మాత్రం ఉపేక్షించాల్సిన అవసరం లేదు. కొత్తగా వేసిన 28 మంది కమిటీలు అతి త్వరలోనే ఆయా నియోజకవర్గాల్లో పర్యటించి, సమాచారాన్ని సేకరించే పని మొదలుపెడతాయి. జనసేన పార్టీ మొదటి అంకం నుంచి తదుపరి అంకం ప్రక్రియను మొదలుపెట్టబోతోంది. ఈ ప్రక్రియలో ప్రతి ఒక్కరూ భాగస్వాములే ’’ అన్నారు.









