హైడ్రా కూల్చివేతలపై ఈటల ఆగ్రహం.|

0
0

“అస్మత్‌పేట బాధితులకు అండగా నిలిచిన ఎంపీ.. పేదల ఇళ్ల కూల్చివేతలు ఆపాలని డిమాండ్”

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : బోయిన్‌పల్లి డివిజన్ అస్మత్‌పేటలో హైడ్రా కూల్చివేతలకు నిరసనగా నిర్వహించిన ధర్నాలో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొన్నారు. బాధిత కుటుంబాలను కలిసి వారి సమస్యలను తెలుసుకుని వారికి మద్దతు ప్రకటించారు.

ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ, భూమి యాజమాన్యంపై స్పష్టత తీసుకురాకుండానే పేదల ఇళ్లను కూల్చివేయడం అమానవీయమని విమర్శించారు. భూకబ్జాదారులు, అక్రమ లేఅవుట్లు వేసిన వారిపై చర్యలు తీసుకోకుండా, నిరుపేదల ఇళ్లను లక్ష్యంగా చేసుకోవడం సరైంది కాదన్నారు.

హైడ్రా అధికారులు శనివారాలు, సెలవు రోజుల్లో కూల్చివేతలు చేపడుతున్నారని ఆరోపించిన ఆయన, కోర్టులను ఆశ్రయించే అవకాశం లేకుండా చేస్తున్నారని అన్నారు. నిజమైన పేదలను గుర్తించి రక్షించాలని, అక్రమాలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

పేదల ఇళ్ల కూల్చివేతలు కొనసాగితే హైదరాబాద్ బస్తీల ప్రజలందరినీ ఏకం చేసి ఉద్యమిస్తామని, బాధితులకు తాము అండగా ఉంటామని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.

#Sidhumaroju

Alwal