భారత్ అవాజ్ | హుజూర్నగర్
విద్యార్థులు చిన్నప్పటి నుంచే శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకుని సైన్స్ అంశాలపై అవగాహన పెంచుకోవాలని జనవిజ్ఞాన వేదిక (జేవీవీ) రాష్ట్ర సభ్యులు షేక్ జాఫర్ అన్నారు.
స్థానిక తెలంగాణ సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ సీహెచ్ రమేష్ అధ్యక్షతన విద్యార్థులకు సైన్స్ ప్రయోగాలపై అభిరుచి, అవగాహన కల్పించే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జేవీవీ రాష్ట్ర సభ్యులు షేక్ జాఫర్, జిల్లా ప్రధాన కార్యదర్శి కలకుంట్ల సైదులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా షేక్ జాఫర్ మాట్లాడుతూ విద్యార్థులు తమ చుట్టూ జరిగే ప్రతి అంశాన్ని శాస్త్రీయ కోణంలో పరిశీలించాలని సూచించారు. ఏదైనా విషయంపై దృఢమైన నిర్ణయానికి రావాలంటే పలుమార్లు పరిశీలించి, ప్రయోగాల ద్వారా రుజువు చేసుకోవాల్సిన అవసరం ఉందని వివరించారు.
ప్రస్తుత సమాజ మార్పులకు అనుగుణంగా శాస్త్ర విజ్ఞానం వేగంగా అభివృద్ధి చెందుతోందని, భావి భారత పౌరులుగా విద్యార్థులు సైన్స్‌పై అవగాహన పెంచుకుని శాస్త్రీయ దృక్పథంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
అనంతరం వివిధ సులభమైన సైన్స్ ప్రయోగాలను ప్రదర్శించి విద్యార్థుల్లో ఆసక్తిని రేకెత్తించారు. విద్యార్థులు ప్రయోగాలను ఆసక్తిగా వీక్షించి సందేహాలను నివృత్తి చేసుకున్నారు.
ఈ కార్యక్రమంలో హాస్టల్ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.










