హైదరాబాద్, ఆగస్టు 6: హైదరాబాద్ ఫుడ్ అడల్టరేషన్ సర్వైలెన్స్ టీమ్ (హెచ్-ఫాస్ట్), జీహెచ్‌ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి నగరంలోని 13 మసాలా ప్రాసెసింగ్, వ్యాపార యూనిట్లలో తనిఖీలు నిర్వహించింది. ఈ దాడుల్లో 25 టన్నులకుపైగా అనుమానిత కల్తీ మసాలా దినుసులను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ముగ్గురిని అరెస్టు చేసి మూడు క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. తనిఖీల్లో అనుమతి లేని రంగులు, ఇతర అనుమానిత పదార్థాలు వినియోగించినట్లు అధికారులు ఆరోపించారు. స్వాధీనం చేసుకున్న నమూనాలను ప్రయోగశాల పరీక్షలకు పంపించారు. పరీక్షల తుది నివేదికల ఆధారంగా తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. వినియోగదారులు లైసెన్స్ పొందిన విక్రేతల వద్ద నుంచే ఆహార పదార్థాలు కొనుగోలు చేయాలని సూచించారు.










