హరియాణాలోని సోనిపట్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త వృద్ధాశ్రమంలో అనాథలా కన్నుమూశారు. పిల్లలను ఉన్నత స్థితిలో నిలబెట్టినా.. ఆయన చివరి మజిలీ ఒంటరిగానే ముగిసింది. కన్నతండ్రి చనిపోయినా కూతుళ్లు కడసారి చూపునకు రాలేదు. పైగా తండ్రి అంత్యక్రియలను వీడియో కాల్‌లో చూస్తూ, ఖర్చుల కోసం కేవలం రూ.5,100 పంపి చేతులు దులుపుకున్నారు. ఈ అమానవీయ ఘటనపై హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మానవ సంబంధాలు, నైతిక విలువలు మంటగలుస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. డిజిటల్ స్క్రీన్లు, ఆన్‌లైన్ మనీ ట్రాన్స్‌ఫర్‌లు కన్నపేగు బంధానికి ప్రత్యామ్నాయం కాజాలవని స్పష్టం చేశారు. కన్నవారికి ఆఖరి ఘడియల్లో తోడుగా నిలబడలేని విలాసవంతమైన బతుకులు, చదువులు ఎందుకని సమాజాన్ని సూటిగా ప్రశ్నించారు.










