రాజస్థాన్‌ టు మల్కాజ్‌గిరి.. MDMA దందా గుట్టురట్టు.|

0
12

● ఇద్దరు నిందితుల అరెస్ట్.. రూ.2.76 లక్షల విలువైన MDMA పట్టివేత

● రాజస్థాన్‌ నుంచి హైదరాబాద్‌కు MDMA సరఫరా చేస్తున్న ముఠా గుట్టురట్టు

● రైల్వే స్టేషన్‌ సమీపంలో ఎస్‌ఓటీ, స్థానిక పోలీసుల సంయుక్త ఆపరేషన్‌

అల్వాల్, సెప్టెంబరు 22: మల్కాజ్‌గిరి పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో ఎస్‌ఓటీ మల్కాజ్‌గిరి జోన్‌, స్థానిక పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో 23 గ్రాముల MDMAను పట్టుకున్నారు.

ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి రూ.2.76 లక్షల విలువైన MDMA, రెండు మొబైల్‌ ఫోన్లు, రూ.5,600 నగదును స్వాధీనం చేసుకున్నారు.

మల్కాజ్‌గిరి జోన్‌ డీసీపీ Ch. శ్రీధర్‌ ఐపీఎస్‌ తన కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో కేసు వివరాలను వెల్లడించారు.

రాజస్థాన్‌కు చెందిన మహావీర్‌ సింగ్‌ సికింద్రాబాద్‌ రాణిగంజ్‌లో నివాసం ఉంటూ రాపిడో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో డ్రగ్స్‌ విక్రయాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.

రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌కు చెందిన కుల్దీప్‌ అనే సప్లయర్‌ వద్ద నుంచి మహావీర్‌ సింగ్‌ MDMAను తక్కువ ధరకు కొనుగోలు చేసి హైదరాబాద్‌కు తీసుకొచ్చాడు. 

బోయిన్‌పల్లికి చెందిన క్యాటరింగ్‌ వ్యాపారి లక్ష్మణ్‌ సింగ్‌ రాజ్‌పురోహిత్‌తో పాటు నగరంలోని ఇతర వినియోగదారులకు డ్రగ్స్‌ విక్రయిస్తున్నట్లు గుర్తించారు.

మల్కాజ్‌గిరి రైల్వే స్టేషన్‌ సమీపంలోని వేపచెట్టు వద్ద డ్రగ్స్‌ విక్రయించేందుకు నిందితులు వేచి ఉన్నారనే సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకుని వారిని అదుపులోకి తీసుకున్నారు.

వారి హ్యాండ్‌ బ్యాగ్‌ను తనిఖీ చేయగా పాలిథిన్‌ కవర్లలో ప్యాక్‌ చేసిన 23 గ్రాముల MDMA లభించింది.

ఈ కేసులో ప్రధాన సప్లయర్‌ కుల్దీప్‌తో పాటు కోకాపేటకు చెందిన కస్టమర్‌ కైలాష్‌ పరారీలో ఉన్నారు. వారి కోసం పోలీసులు గాలింపు కొనసాగిస్తున్నారు.

పోలీస్‌ కమిషనర్‌ బి. సుమతి ఐపీఎస్‌ పర్యవేక్షణలో ఎస్‌ఓటీ డీసీపీ కె. మనోహర్‌, మల్కాజ్‌గిరి జోన్‌ డీసీపీ Ch. శ్రీధర్‌ ఐపీఎస్‌, ఎస్‌ఓటీ అడిషనల్‌ డీసీపీ ఎండి. షాకిర్‌ హుస్సేన్‌ మార్గదర్శకత్వంలో ఆపరేషన్‌ నిర్వహించారు.

డ్రగ్స్‌ సరఫరా, విక్రయాలపై నిఘా కొనసాగుతోందని, మాదకద్రవ్యాలకు సంబంధించిన సమాచారం ఉంటే ప్రజలు పోలీసులకు అందించి సహకరించాలని డీసీపీ కోరారు.

#Sidhumaroju

Alwal