మహబూబాబాద్ జిల్లా మరిపెడ పోలీస్ స్టేషన్లో ప్రమాదం చోటుచేసుకుంది. ఎంతో కాలంగా శిథిలావస్థకు చేరిన ఈ భవనంలో విధులు నిర్వర్తిస్తున్న ఏఎస్సై శ్రీనివాసరావుపై సీలింగ్ పెచ్చులు ఊడిపడటంతో ఆయన భుజానికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ‘జైల్ భరో’ కార్యక్రమం బందోబస్తు కారణంగా మిగతా కంప్యూటర్ సిబ్బంది బయటకు వెళ్లడంతో పెను ముప్పు తప్పింది. రక్షణ కల్పించే పోలీసులే ఇలాంటి ప్రాణాపాయ స్థితిలో, భయం గుప్పిట్లో విధులు నిర్వర్తించడం పట్ల స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సర్వహంగులతో కొత్త పోలీస్ స్టేషన్ భవనం నిర్మాణం పూర్తయి ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది. మరో ప్రమాదం జరగకముందే పోలీసులను తక్షణమే ఆ కొత్త భవనంలోకి మార్చాలని, వారు సురక్షితంగా విధులు నిర్వర్తించేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.










