కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను వెంటనే పునరుద్ధరించాలి

0
1

నిజామాబాద్ ధర్నా చౌక్‌లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు, మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల ఆదేశాలతో నగర అధ్యక్షుడు సిర్ప రాజు ఆధ్వర్యంలో ఈ ధర్నా చేపట్టారు.

ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హైకోర్టు తీర్పును సాకుగా చూపి పేదింటి ఆడబిడ్డలకు అందుతున్న సంక్షేమ పథకాలను నిలిపివేయొద్దని డిమాండ్ చేశారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రారంభించిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు పేద కుటుంబాలకు ఆర్థిక భరోసాగా నిలిచాయని పేర్కొన్నారు. పెండింగ్‌లో ఉన్న అర్హుల దరఖాస్తులను వెంటనే పరిష్కరించి, ఆర్థిక సహాయాన్ని విడుదల చేయాలని కోరారు.

అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన తులం బంగారం హామీని అమలు చేయాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు, యువ నాయకులు తదితరులు పాల్గొన్నారు.