ఉయిక శిరీష మృతికి సంతాపం.. చింతూరులో కొవ్వొత్తుల ర్యాలీ |

0
1

పోలవరం జిల్లా చింతూరు డివిజన్ కేంద్రంలో ఉయిక శిరీష మృతికి సంతాపంగా ఆదివాసీ గిరిజన సంఘాలు, ఉద్యోగ సంఘాలు, ఆదివాసీ జేఏసీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. హైదరాబాద్‌లోని తుక్కుగూడలో విధులు నిర్వహిస్తున్న ఏఎన్‌ఎం ఉయిక శిరీషపై జరిగిన హత్యాచారం ఘటనపై నాయకులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు బాధ్యులైన నిందితులను ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ద్వారా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

ఉపాధి కోసం మారుమూల ప్రాంతాల నుంచి నగరాలకు వెళ్లే మహిళలకు పని ప్రదేశాల్లో పూర్తి భద్రత కల్పించాలని నాయకులు కోరారు. మహిళలపై వేధింపులు, హత్యలు, అత్యాచారాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, మద్యం మరియు డ్రగ్స్ నియంత్రణపై ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించాలని సూచించారు.

శిరీష కుటుంబానికి రూ.20 లక్షల పరిహారం అందించడంతో పాటు కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే ఘటనపై సమగ్ర విచారణ జరిపి, ఆసుపత్రి యాజమాన్యం నిర్లక్ష్యం ఉన్నట్లయితే బాధ్యులపై కూడా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు ఆదివాసీ, ఉద్యోగ సంఘాల నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.