తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. ఏమిటీ ఘట్టం?

0
3

కలియుగ వైకుంఠం తిరుమల క్షేత్రం మరో అపురూప ఘట్టానికి సిద్ధమైంది. శ్రీ వేంకటేశ్వర స్వామివారి వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 15వ తేదీన అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఈ తొమ్మిది రోజుల మహా వేడుకకు శాస్త్రోక్తంగా బీజం వేసే అత్యంత కీలకమైన ఘట్టం “అంకురార్పణ”. నేటి (సెప్టెంబర్ 14) రాత్రి 7 గంటల నుంచి 8 గంటల మధ్య ఈ కార్యక్రమాన్ని వైఖానస ఆగమశాస్త్రం ప్రకారం నిర్వహించనున్నారు. అసలు అంకురార్పణ అంటే ఏమిటి? ఈ క్రతువును ఎందుకు నిర్వహిస్తారు? దాని వెనుక ఉన్న అంతరార్థం ఏమిటో వివరంగా చూద్దాం.

 అంకురార్పణ అంటే లోక కల్యాణ సంకల్పం


 “అంకురార్పణ” అంటే విత్తనాన్ని నాటడం లేదా బీజవాపనం అని అర్థం. ఏ వైదిక ఉత్సవం ప్రారంభించే ముందైనా ఈ ఘట్టాన్ని నిర్వహించడం ఆగమశాస్త్ర సంప్రదాయం. బ్రహ్మోత్సవాలు ఎలాంటి విఘ్నాలు లేకుండా విజయవంతంగా జరగాలని, ఈ భూమండలం పాడిపంటలతో, పశుపక్ష్యాదులతో సుభిక్షంగా, సస్యశ్యామలంగా ఉండాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ ఈ క్రతువును చేపడతారు. ఇది కేవలం ఒక ఉత్సవానికి నాంది పలకడమే కాదు, సమస్త జీవరాశి సౌభాగ్యాన్ని ఆకాంక్షించే ఒక మహత్తర సంకల్పం.