గుంతలమయంగా మారిన రహదారి రోడ్డుపై బైఠాయించి చిన్నారుల రాస్తారోకో

0
22

🎤కుమురం భీం ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్): సిర్పూర్ నియోజకవర్గం పరిధిలోని పెంచికల్‌పేట్ నుండి బెజ్జూర్ వెళ్లే ప్రధాన రహదారి పాలకుల నిర్లక్ష్యానికి సజీవ సాక్ష్యంగా మారింది. ఈ ప్రధాన రహదారి పూర్తిగా గుంతలమయంగా మారడంతో ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. రహదారి అధ్వాన్నంగా తయారవడంతో ఈ మార్గంలో ఆటోలు, బస్సుల రాకపోకలు సాగించడం అత్యంత కష్టతరంగా మారింది. నిత్యం పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు సమయానికి చేరుకోలేక, ప్రయాణంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేకపోవడంతో విసిగిపోయిన చిన్నారులు చివరకు పోరాట బాట పట్టారు. రహదారి సమస్యను నిరసిస్తూ పాఠశాల విద్యార్థులు, చిన్నారులు రోడ్డుపైనే బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. స్థానిక బిజెపి ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబుకు వ్యతిరేకంగా తీవ్రస్థాయిలో నినాదాలు చేస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు కేవలం ఓట్ల కోసమే వస్తున్నారని, కనీస సౌకర్యాలైన రహదారులను కూడా బాగు చేయడం లేదని మండిపడ్డారు. రహదారిని యుద్ధప్రతిపాదికన మరమ్మతులు చేపట్టి తమకు రవాణా ఇబ్బందులు కలగకుండా చూడాలని చిన్నారులు, స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తక్షణ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.