వాగులు, వంకల వద్ద నిరంతర పర్యవేక్షణ
జి.కొండూరు, సెప్టెంబర్ 24: భారీ వర్షాల నేపథ్యంలో వాగులు, వంకలు, వంతెనలు, చెరువులు, ఇతర జలవనరుల వద్ద పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. ప్రజల ప్రాణ భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
గురువారం కలెక్టర్ క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా హెచ్.ముత్యాలంపాడు వంతెన, వెలగలేరు తదితర ప్రాంతాలను సందర్శించి వర్షాల పరిస్థితి, వాగులు–వంకల్లో నీటి ప్రవాహాన్ని పరిశీలించారు. సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరిగే ప్రమాదం ఉన్నందున ప్రజలు వాగులు, వంకలు దాటేందుకు ప్రయత్నించకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు. వంతెనలు, కల్వర్టులు, రహదారుల వద్ద నీటి ప్రవాహాన్ని నిరంతరం గమనిస్తూ ప్రమాదకర పరిస్థితులు ఏర్పడితే వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
గ్రామీణ ప్రాంతాల్లో చెరువులు, కాలువలు, వాగులు, వంకలను స్థానిక అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, అవసరమైన చోట హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి ప్రజలను అప్రమత్తం చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు.










