సీపీ బి. సుమతి, ఐపీఎస్‌ పకడ్బందీ ప్రణాళిక.. గణేశ్‌ నిమజ్జనానికి భారీ భద్రత.!

0
3

• ‘గణేశ్‌ సురక్షా సంకల్ప్‌–2026’తో ప్రత్యేక భద్రతా ప్రణాళిక

• 5,874 మంది పోలీసులతో విస్తృత బందోబస్తు

• సుమారు 15 వేల విగ్రహాల నిమజ్జనానికి ఏర్పాట్లు

• 5 వేల సీసీ కెమెరాలతో నిరంతర నిఘా

అల్వాల్, సెప్టెంబర్ 24: గణేశ్‌ నిమజ్జనాన్ని ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు మల్కాజిగిరి పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో పకడ్బందీ భద్రతా చర్యలు చేపట్టారు. 

మల్కాజిగిరి సీపీ బి. సుమతి, ఐపీఎస్‌ నేతృత్వంలో ‘గణేశ్‌ సురక్షా సంకల్ప్‌–2026’ పేరుతో ప్రత్యేక భద్రతా ప్రణాళికను అమలు చేస్తున్నారు.

శుక్రవారం జరిగే ప్రధాన నిమజ్జనాన్ని దృష్టిలో ఉంచుకుని భారీగా పోలీస్‌ బలగాలను రంగంలోకి దించారు.

కమిషనరేట్‌ పరిధిలో సుమారు 15 వేల గణేశ్‌ విగ్రహాలు నిమజ్జనం కానున్నట్లు అంచనా వేస్తున్నారు. ఇందుకోసం 5,874 మంది పోలీస్‌ సిబ్బందిని బందోబస్తు విధుల్లో నియమించారు. కమిషనరేట్‌ పోలీసులతో పాటు ఇతర విభాగాలు, బయటి యూనిట్ల నుంచి వచ్చే అధికారులు, అదనపు బలగాల సేవలను కూడా వినియోగిస్తున్నారు.

నిమజ్జన ఊరేగింపులు సాగే మార్గాలు, ప్రధాన చౌరస్తాలు, సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించారు. కమిషనరేట్‌ పరిధిలోని 5 వేల సీసీ కెమెరాలను గుర్తించి వాటి ద్వారా నిరంతర నిఘా కొనసాగిస్తున్నారు. 

నిమజ్జన సమయంలో క్షేత్రస్థాయి పరిస్థితులను పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకునేలా పోలీస్‌ యంత్రాంగం అప్రమత్తంగా ఉంది.

మరోవైపు గణేశ్‌ నిమజ్జనం సందర్భంగా మల్కాజిగిరి కమిషనరేట్‌ పరిధిలో గుర్తించిన నిమజ్జన కేంద్రాల్లో ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.

మల్కాజిగిరి జోన్‌లోని అల్వాల్‌ సర్కిల్‌ పరిధిలో కొత్త చెరువు, బతుకమ్మ పార్క్‌, భూదేవి నగర్‌ పార్క్‌, మన్నెవారికుంటలను నిమజ్జన కేంద్రాలుగా గుర్తించారు.

నిమజ్జన కార్యక్రమం సందర్భంగా భారీగా భక్తులు, విగ్రహాలు తరలివచ్చే అవకాశం ఉండటంతో శాంతిభద్రతలతో పాటు రద్దీ నియంత్రణపై కూడా పోలీసులు దృష్టి సారించారు. పోలీస్‌, ఇతర విభాగాల మధ్య సమన్వయంతో ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. 

ప్రజలు, గణేశ్‌ ఉత్సవ నిర్వాహకులు పోలీసుల సూచనలు పాటిస్తూ నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంతంగా నిర్వహించేందుకు సహకరించాలని పోలీస్‌ యంత్రాంగం కోరుతోంది.

#Sidhumaroju

Alwal