సమయస్ఫూర్తితో ముగ్గురి ప్రాణాలు నిలిపిన ఏఎస్ఐ మంగయ్య నాయక్, ఏఆర్ సిబ్బంది
ఎన్టీఆర్జ జిల్లా, జగ్గయ్యపేట, సెప్టెంబర్ 25Bharath Aawaz: కుటుంబ వేధింపులు తాళలేక ఇద్దరు పిల్లలతో కలిసి కృష్ణా నదిలో దూకి ఆత్మహత్యకు యత్నించిన మహిళను వినాయక నిమజ్జనం బందోబస్తులో ఉన్న పోలీసులు చాకచక్యంగా కాపాడారు. ఈ ఘటన జగ్గయ్యపేట కృష్ణా నది తీరంలో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది.
ఖమ్మం జిల్లా ముదిగొండకు చెందిన రామకృష్ణతో బండిపాలెం గ్రామానికి చెందిన ఉప్పుతోళ్ల కళ్యాణి (26)కి పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం జగ్గయ్యపేట ధనంపూడి కాలనీలో నివాసం ఉంటున్నారు.
కుటుంబంలో కొంతకాలంగా జరుగుతున్న వేధింపులతో కళ్యాణి తీవ్ర మనస్తాపానికి గురైనట్లు సమాచారం. గతంలోనూ ఆమె ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
క్షణాల్లో స్పందించిన పోలీసులు
శుక్రవారం సాయంత్రం సుమారు 4.30 గంటల సమయంలో కళ్యాణి తన ఇద్దరు పిల్లలతో కలిసి కృష్ణా నది వద్దకు చేరుకుంది. నదిలోకి దూకేందుకు ప్రయత్నిస్తుండగా, అదే సమయంలో వినాయక నిమజ్జనం బందోబస్తులో ఉన్న ఏఎస్ఐ మంగయ్య నాయక్, ఏఆర్ కానిస్టేబుళ్లు అప్పలరాజు (PC-519), PC-371 అప్రమత్తమయ్యారు.
వెంటనే స్పందించిన పోలీసులు నదిలోకి దూకుతున్న తల్లితో పాటు ఇద్దరు పిల్లలను సురక్షితంగా ఒడ్డుకు తీసుకొచ్చారు. అనంతరం వారికి ధైర్యం చెప్పి కౌన్సెలింగ్ నిర్వహించారు.
తదుపరి కళ్యాణి తల్లిని పోలీస్ స్టేషన్కు పిలిపించి, ఆమె సమక్షంలో కళ్యాణి, ఇద్దరు పిల్లలను సురక్షితంగా అప్పగించారు.ముగ్గురి ప్రాణాలను కాపాడేందుకు సమయస్ఫూర్తితో వ్యవహరించిన ఏఎస్ఐ మంగయ్య నాయక్, ఏఆర్ సిబ్బందిని స్థానికులు, పోలీసు ఉన్నతాధికారులు అభినందించారు.










