ఆనాటి దౌర్జన్యాలే.. నేటికీ పేదలపై దాడులు: ఈటల.|

0
7

● తెలంగాణ పౌరుషానికి, చైతన్యానికి ఐలమ్మ నిలువెత్తు సాక్ష్యం

● పేదల ఇళ్లు, భూముల పరిరక్షణకు ఐక్యత అవసరం

● మహనీయుల స్ఫూర్తిని ఆచరణలో పెట్టాలి: ఈటల రాజేందర్

అల్వాల్, సెప్టెంబర్ 26: తెలంగాణ పౌరుషానికి, చైతన్యానికి చాకలి ఐలమ్మ నిలువెత్తు సాక్ష్యమని మల్కాజిగిరి పార్లమెంటు సభ్యుడు ఈటల రాజేందర్ కొనియాడారు. 

సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని సిఖ్ విలేజ్ ధోబీఘాట్‌లో నిర్వహించిన తెలంగాణ వీరనారి, ధీరవనిత చాకలి ఐలమ్మ 131వ జయంతి వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడారు.

పేదరికంలో జన్మించినప్పటికీ ధర్మాన్ని కాపాడేందుకు, దుర్మార్గాన్ని ఎదిరించేందుకు ఐలమ్మ ప్రదర్శించిన తెగువను తెలంగాణ సమాజం ఎప్పటికీ మరువదని ఈటల రాజేందర్ అన్నారు.

ఎక్కడ అన్యాయం, దౌర్జన్యం, అక్రమాలు జరిగినా సమష్టిగా ఎదుర్కొనే సంప్రదాయం గతంలో ఉండేదని, ప్రస్తుతం సమాజంలో ఆ చైతన్యం క్రమంగా సన్నగిల్లడం ఆందోళనకరమని పేర్కొన్నారు.

మహనీయుల జయంతులు, స్మారక దినాలను నిర్వహించడం కేవలం ఉత్సవాలకే పరిమితం కాకూడదని అన్నారు. వారు అందించిన చైతన్యాన్ని, పోరాట స్ఫూర్తిని మరోసారి గుర్తుచేసుకుని ఆచరణలో పెట్టేందుకు ప్రయత్నించాల్సిన సందర్భాలుగా వాటిని చూడాలని సూచించారు.

నేటికీ పేదలపై దౌర్జన్యాలు కొనసాగుతున్నాయని ఈటల రాజేందర్ పేర్కొన్నారు. పేదల ఇళ్లు కూల్చివేస్తున్నా, భూములు గుంజుకుంటున్నా, వాటిని నిషేధిత జాబితాలో చేర్చుతున్నా తగిన రీతిలో స్పందన లేకపోవడం సరైన పరిణామం కాదన్నారు. 

ఆనాడు కొనసాగిన దౌర్జన్యాలకు, నేటి పరిస్థితులకు పోలిక ఉందని పేర్కొంటూ, పేదలు తమ బతుకులను,ఇళ్లను, కష్టపడి సంపాదించుకున్న భూములను కాపాడుకోవాలంటే ఐక్యంగా నిలవాల్సిన తక్షణ అవసరం ఉందని స్పష్టం చేశారు.

చాకలి ఐలమ్మ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని పేదలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని ఈ సందర్భంగా ఈటల రాజేందర్ ప్రతిజ్ఞ చేశారు.

కార్యక్రమంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు సభ్యురాలు బానుక నర్మద మల్లికార్జున్, మాజీ కార్పొరేటర్ కొంతం దీపిక నరేష్, జిల్లా దిశా కమిటీ సభ్యుడు పరశురామ్, మాజీ కంటోన్మెంట్ బోర్డు ఉపాధ్యక్షుడు సదా కేశవ రెడ్డి, బి.ఎన్. శ్రీనివాస్, కంటోన్మెంట్ అసెంబ్లీ కన్వీనర్ విజయానంద్, 3వ వార్డు అధ్యక్షుడు అరుణ్‌తో పాటు రజక సంఘం నాయకులు, పార్టీ ప్రముఖులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

#Sidhumaroju

Alwal