ఆంధ్రప్రదేశ్లో గ్రామాల సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా రూ.10 వేల కోట్ల భారీ వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతూ కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న “పల్లె పండుగ–3.0” కార్యక్రమ ఏర్పాట్లు వరికుంటపాడు మండలం, రామాపురం గ్రామంలో శరవేగంగా కొనసాగుతున్నాయి.
ఈ నెల 29వ తేదీన వరికుంటపాడు మండలం, రామాపురం గ్రామంలో నిర్వహించనున్న పల్లె పండుగ–3.0 కార్యక్రమానికి సంబంధించి సభా వేదిక, పార్కింగ్, హెలిప్యాడ్ తదితర ప్రాంతాల్లో జరుగుతున్న ఏర్పాట్లను ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారు క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా కందుకూరు ఎమ్మెల్యే శ్రీ ఇంటూరి నాగేశ్వరరావు గారు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు, మండల కూటమి ముఖ్య నాయకులతో కలిసి ఏర్పాట్ల పురోగతిని సమీక్షించారు.
సభా ప్రాంగణం, పార్కింగ్, హెలిప్యాడ్, ప్రజల రాకపోకలు, భద్రతా ఏర్పాట్లు తదితర అంశాలను పరిశీలించిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారు, కార్యక్రమానికి హాజరయ్యే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా, సమన్వయంతో పూర్తి చేయాలని అధికార యంత్రాంగానికి దిశానిర్దేశం చేశారు.
అలాగే కార్యక్రమ నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మౌలిక వసతుల కల్పన, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్, భద్రత తదితర అంశాలపై అధికారులకు పలు సూచనలు చేశారు.
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి పెద్దపీట వేస్తూ, ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం చేపడుతున్న పల్లె పండుగ–3.0 కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.










