ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్: ప్రకృతి వైపరీత్యం ఒకే కుటుంబంలో రెండు తరాలను బలితీసుకున్న అత్యంత హృదయవిదారక ఘటన కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో వెలుగుచూసింది. నాడు తండ్రిని బలితీసుకున్న వాగే. నేడు కొడుకు ప్రాణాలను సైతం బలిగొంది. స్థానికులు మరియు అధికారుల కథనం ప్రకారం. కెరమెరి మండలం కొత్తగూడ గ్రామానికి చెందిన దుర్వ శ్రీనివాస్ (40) జోడేఘాట్ ఆశ్రమ ఉన్నత పాఠశాలలో సీఆర్‌టీ పీఈటీ (CRT PET) గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ నెల 24న ఆయన విధు ముగించుకుని ఇంటికి వస్తుండగా, భారీ వర్షాల కారణంగా కెరమెరి మండలంలోని పెద్దవాగు ఉధృతంగా ప్రవహించింది. ఈ క్రమంలో వాగు దాటేందుకు ప్రయత్నించిన శ్రీనివాస్ నీటి ఉధృతికి కొట్టుకుపోయి గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న అధికారులు, స్థానిక గ్రామస్థులు వెంటనే గాలింపు చర్యలు చేపట్టారు. అధికారులు, గ్రామస్థులు నిరంతరాయంగా గాలించడంతో చివరికి నిసాని గ్రామ సమీపంలో శ్రీనివాస్ మృతదేహం లభ్యమైంది.
కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న కుటుంబ సభ్యులు. ఈ ఘటనతో కొత్తగూడ గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. అయితే, ఈ విషాదంలో మరో పెను విషాదకరమైన కోణం దాగుంది. సరిగ్గా 15 ఏళ్ల క్రితం, అంటే 2011లో శ్రీనివాస్ తండ్రి మెంగు కూడా ఇదే పెద్దవాగులో కొట్టుకుపోయి మృతి చెందారు. నాటి తండ్రి మరణాన్ని మరువక ముందే. నేడు అదే వాగు రూపంలో మృత్యువు కొడుకు శ్రీనివాస్‌ను కూడా బలితీసుకోవడం స్థానికులను తీవ్రంగా కలచివేస్తోంది. ఒకే వాగులో తండ్రీకొడుకులు ఇద్దరూ ప్రాణాలు కోల్పోవడంతో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. మృతుని కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు









