భూకబ్జాదారుడిపై పీడీ యాక్ట్ ప్రయోగం|

0
7

● రాంపల్లిలో వివాదాస్పద భూమిపై అక్రమ లేఅవుట్‌ ఏర్పాటు చేసి ప్లాట్ల విక్రయం 

● అమాయక కొనుగోలుదారులను మోసం చేసినట్లు ఆరోపణలు 

● చర్లపల్లి కేంద్ర కారాగారానికి తరలింపు

అల్వాల్, నవంబర్ 14:భూముల పేరుతో ప్రజలను మోసం చేస్తున్న వారిపై మల్కాజిగిరి పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా వివాదాస్పద భూమిపై అక్రమ లేఅవుట్‌ ఏర్పాటు చేసి, ప్లాట్లు విక్రయిస్తూ కొనుగోలుదారులను మోసం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పంజాల జైహింద్ గౌడ్ (63)పై పీడీ యాక్ట్‌ ప్రయోగించారు. ఈ నెల 13న ఆయనపై నిర్బంధ చట్టం కింద చర్యలు తీసుకున్నట్లు మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ వెల్లడించింది.

వివరాల్లోకి వెళితే.. రాంపల్లి ప్రాంతంలోని వివాదాస్పద భూమిలో అనుమతులు లేని లేఅవుట్‌ ఏర్పాటు చేసిన నిందితుడు, సదరు భూమికి స్పష్టమైన యాజమాన్య హక్కులు, చట్టబద్ధత ఉన్నట్లు నమ్మించి అమాయకులకు ప్లాట్లు విక్రయించినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో 2026లో పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆయనపై పలు కేసులు నమోదయ్యాయి.

> పీడీ యాక్ట్‌ అమలు.. చర్లపల్లికి తరలింపు

ఈ నెల 13న పీడీ యాక్ట్‌ అమలులో భాగంగా నిందితుడిని చర్లపల్లి కేంద్ర కారాగారానికి తరలించారు. భూకబ్జాలు, భూ మోసాలకు పాల్పడుతూ ప్రజలను ఇబ్బందులకు గురిచేసే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బి. సుమతి, ఐపీఎస్ హెచ్చరించారు.

> ప్లాట్ల కొనుగోలుదారులకు పోలీసుల సూచన

ఏదైనా స్థలం లేదా ప్లాటు కొనుగోలు చేసే ముందు భూమి యాజమాన్య హక్కులు, టైటిల్ డాక్యుమెంట్లు, చట్టపరమైన అనుమతులు, లేఅవుట్‌ స్థితిగతులను పూర్తిగా పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని పోలీసులు ప్రజలకు సూచించారు.

#Sidhumaroju

Alwal