ఆసిఫాబాద్ (భారత్ అవాజ్ న్యూస్): కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా, ఆసిఫాబాద్ మండలం మొతుగూడ గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన చౌదరి వర్షిత్ (9) అనే ఐదో తరగతి విద్యార్థి రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు.
వివరాల్లోకి వెళితే.. వర్షిత్ తన ఇంటి ముందు రోడ్డుపై ఆడుకుంటుండగా, మంచిర్యాల నుండి ఆసిఫాబాద్ వైపు వస్తున్న ఆర్టీసీ పల్లె వెలుగు బస్సు బాలుడిని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన చిన్నారి అక్కడికక్కడే మృతి చెందాడు.
అల్లారుముద్దుగా పెంచుకున్న కొడుకు కళ్లముందే విగతజీవిగా మారడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనతో మొతుగూడ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.










