• హిమాచల్ నగర్, నక్కవానిపాలెం, ఎదురువానిపాలెం ప్రాంతాలలో ఘనంగా పత్రాల పంపిణీ
“పేదలకు పట్టాభిషేకం – బాబు హామీ మీ చేతికే మీ భూమి” కార్యక్రమంలో భాగంగా, విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గ ములగాడ మండలం పరిధిలోని 58, 59 వార్డులకు చెందిన లబ్ధిదారులకు శాశ్వత రిజిస్టర్డ్ ఆస్తి పత్రాల పంపిణీ కార్యక్రమం మంగళవారం అత్యంత వైభవంగా జరిగింది. 59వ వార్డు పరిధిలోని హిమాచల్ నగర్, నక్కవానిపాలెం, అలాగే 58వ వార్డు పరిధిలోని ఎదురువానిపాలెం ప్రాంతాలలో నిర్వహించిన ప్రత్యేక కార్యాలయంలో విశాఖపట్నం పశ్చిమ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ శ్రీ పి.జి.వి.ఆర్. నాయుడు (గణబాబు) గారు ముఖ్య అతిథిగా పాల్గొని, సుమారు 650 మంది లబ్ధిదారులకు సబ్-రిజిస్ట్రార్ కార్యాలయ అధికారిక ముద్రతో కూడిన శాశ్వత రిజిస్టర్డ్ ఆస్తి పత్రాలను (కన్వేయెన్స్ డీడ్స్) స్వయంగా అందజేశారు.
ఈ సందర్భంగా శ్రీ గణబాబు గారు మాట్లాడుతూ, గతంలో ఇచ్చిన నామమాత్రపు డీ-ఫామ్ పట్టాల మాదిరిగా కాకుండా, కూటమి ప్రభుత్వం పేదలకు సంపూర్ణ యాజమాన్య హక్కులను కల్పిస్తూ రాజముద్రతో కూడిన పూర్తి స్థాయి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లను అందిస్తోందని స్పష్టం చేశారు. దశాబ్దాల క్రితం ఉపాధి కోసం కొండవాలు, పారిశ్రామిక ప్రాంతాలు, ప్రభుత్వ భూముల్లో గూడు కట్టుకుని తాతలు, తండ్రుల కాలం నుంచి భయం భయంగా బతికిన పేద కుటుంబాలకు నేడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో శాశ్వత రక్షణ, భరోసా దక్కిందని తెలిపారు. నగరంలో భూముల విలువలు పెరిగిన నేపథ్యంలో, ఆ పెరిగిన సంపద కేవలం ధనికులకే కాకుండా పేదలకు కూడా దక్కాలన్న మహోన్నత ఆశయంతో వేల కోట్ల విలువైన ఆస్తులను పేదల పరం చేశామని పేర్కొన్నారు.
ఈ అధికారిక ఆస్తి పత్రాల ద్వారా బ్యాంకుల నుంచి చట్టబద్ధంగా రుణాలు పొంది పిల్లల ఉన్నత చదువులకు, శుభకార్యాలకు, కుటుంబ ఆర్థిక పురోగతికి వినియోగించుకోవచ్చని, ఇవి భావితరాల భవిష్యత్తుకు బలమైన ఆర్థిక రక్షణగా నిలుస్తాయని ఆయన వివరించారు. అలాగే కొన్ని నెలలుగా రాత్రింబవళ్లు శ్రమించి వేలాది డాక్యుమెంట్లను సిద్ధం చేసిన ములగాడ తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్, రెవెన్యూ సిబ్బంది మరియు వీఆర్వోల సేవలను గణబాబు గారు ప్రత్యేకంగా కొనియాడారు.
ఈ కార్యక్రమంలో ములగాడ మండల తహసీల్దార్, రెవెన్యూ అధికారులు, స్థానిక వార్డుల ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో లబ్ధిదారులు పాల్గొన్నారు.









