సుచిత్ర–మేడ్చల్ ఎలివేటెడ్ కారిడార్ పనుల్లో తీవ్ర జాప్యం.. ప్రయాణికులకు తప్పని ట్రాఫిక్ కష్టాలు!

0
3

హైదరాబాద్: సుచిత్ర నుంచి కొంపల్లి మీదుగా మేడ్చల్ వరకు జాతీయ రహదారి (NH-44)పై చేపట్టిన ఎలివేటెడ్ కారిడార్, ఫ్లైఓవర్ల నిర్మాణ పనుల్లో తీవ్ర జాప్యం చోటుచేసుకుంటోంది. 2022లో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు పనులు 2024 నాటికే పూర్తి కావాల్సి ఉన్నప్పటికీ, ఇప్పటికీ అసంపూర్తిగానే ఉండటంతో నిత్యం ఈ మార్గంలో ప్రయాణించే వాహనదారులు, స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

రెండేళ్లలో పూర్తికావాల్సిన పనులు.. ఏళ్ల తరబడి జాప్యం!

సుచిత్ర–కొంపల్లి–మేడ్చల్ మార్గంలో ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించేందుకు చేపట్టిన ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఇప్పటివరకు సుచిత్ర ఫ్లైఓవర్ పనులు సుమారు 50 శాతం, మేడ్చల్ ఫ్లైఓవర్ పనులు 65 శాతం మేర మాత్రమే పూర్తయినట్లు సమాచారం. నిర్ణీత గడువులో పనులు పూర్తికాకపోవడంతో ఈ మార్గంలో ప్రయాణం ప్రజలకు నిత్య నరకంగా మారుతోంది

పాత కాంట్రాక్ట్ రద్దు.. కొత్త టెండర్లకు ఆహ్వానం

నిర్మాణ పనులు సకాలంలో పూర్తి చేయకపోవడం, నిధుల కొరత కారణంగా ఎదురైన సమస్యల నేపథ్యంలో గతంలో పనులు చేపట్టిన కాంట్రాక్ట్ సంస్థ ఒప్పందాన్ని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) రద్దు చేసినట్లు సమాచారం. మిగిలిన పనులను పూర్తి చేసేందుకు కొత్తగా టెండర్లను ఆహ్వానించింది

కొత్త కాంట్రాక్టర్‌ను ఖరారు చేసి పనులు తిరిగి ప్రారంభించినప్పటికీ, ప్రాజెక్టు పూర్తికి మరో 18 నెలల నుంచి రెండేళ్ల వరకు సమయం పట్టే అవకాశం ఉందని అంచనాలు వెలువడుతున్నాయి. దీంతో ఈ మార్గంలో ప్రయాణించే ప్రజలకు మరికొంతకాలం ట్రాఫిక్ కష్టాలు తప్పేలా కనిపించడం లేదు.

గుంతల రోడ్లు.. దుమ్ము.. ట్రాఫిక్ జామ్‌లు!

నిర్మాణ పనులు అసంపూర్తిగా ఉండటంతో రహదారులు దెబ్బతిని గుంతలమయంగా మారుతున్నాయి. మరోవైపు విపరీతమైన దుమ్ము, నిత్యం ఏర్పడుతున్న ట్రాఫిక్ జామ్‌లతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారులు గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకుపోతున్నారు, ఈ మార్గంలో రోజువారీగా సుమారు 1.5 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నట్లు అంచనా. నిర్మాణ పనుల జాప్యం కారణంగా ప్రమాదాల ముప్పు కూడా పెరుగుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 

..హైకోర్టును ఆశ్రయించిన కొంపల్లి సాఫ్ట్‌వేర్ ఉద్యోగి

ఈ ప్రాజెక్టు నిర్మాణంలో జరుగుతున్న జాప్యం, రహదారుల దుస్థితి, ప్రమాదాల నివారణ అంశాలపై కొంపల్లికి చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ప్రజల ప్రాణాలకు ముప్పు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి నిర్మాణ పనులను వేగవంతం చేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL) దాఖలు చేసినట్లు సమాచారం

ఈ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కోరుతూ స్థానికులు కూడా ఆందోళనలు చేపడుతున్నారు.

పనులు ఎప్పుడు పూర్తవుతాయి?

ఏళ్ల తరబడి కొనసాగుతున్న నిర్మాణ పనులతో ప్రజలు పడుతున్న ఇబ్బందులకు ఎప్పుడు పరిష్కారం లభిస్తుందన్నది ప్రశ్నార్థకంగా మారింది. కొత్త కాంట్రాక్టర్ నియామకం, మిగిలిన పనుల వేగవంతం, రహదారుల మరమ్మతులు, ప్రమాదాల నివారణకు తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు, స్థానికులు కోరుతున్నారు

ప్రజల రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా తాత్కాలిక రహదారి సదుపాయాలు కల్పించి, దుమ్ము నియంత్రణ చర్యలు చేపట్టి, ప్రాజెక్టును నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

సుచిత్ర–మేడ్చల్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం పూర్తయితేనే ఈ మార్గంలో ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించే అవకాశం ఉంది. అప్పటివరకు ప్రయాణికుల అవస్థలు కొనసాగుతూనే ఉంటాయా? అన్నది వేచి చూడాలి..