మంచిర్యాల జోన్‌లో పోలీసుల నాకాబంది
డ్రంక్ అండ్ డ్రైవింగ్‌పై ప్రత్యేక తనిఖీలు.. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు
మంచిర్యాల: శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా మంచిర్యాల జోన్ పరిధిలో పోలీసులు విస్తృతంగా నాకాబంది నిర్వహించారు. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు, మంచిర్యాల డీసీపీ ఏ.భాస్కర్ పర్యవేక్షణలో అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఏకకాలంలో ఆకస్మిక వాహన తనిఖీలు చేపట్టారు.
ఈ సందర్భంగా అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలను తనిఖీ చేయడంతో పాటు అక్రమ రవాణా, గంజాయి, ఇతర మత్తు పదార్థాల తరలింపును అడ్డుకునేందుకు ప్రత్యేకంగా పరిశీలించారు. దొంగతనాలు, చైన్ స్నాచింగ్ తదితర నేరాల నియంత్రణకు వాహనదారుల వివరాలు, ప్రయాణ గమ్యాలు, వాహనాల్లోని వ్యక్తుల వివరాలను పోలీసులు పరిశీలించారు.
డ్రంక్ అండ్ డ్రైవింగ్, ర్యాష్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్, మైనర్ డ్రైవింగ్, సెల్‌ఫోన్ డ్రైవింగ్, హెల్మెట్ లేకుండా ప్రయాణించడం, సరైన వాహన పత్రాలు లేకపోవడం వంటి ట్రాఫిక్ ఉల్లంఘనలపై కేసులు నమోదు చేసి జరిమానాలు విధించారు. వాహనాల ఆర్‌సీ, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్, ఫిట్‌నెస్, పొల్యూషన్ సర్టిఫికెట్లను తనిఖీ చేశారు.
రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై వాహనదారులకు పోలీసులు అవగాహన కల్పించారు. భవిష్యత్‌లోనూ నాకాబంది, వాహన తనిఖీలను మరింత కఠినంగా కొనసాగిస్తామని పోలీసులు తెలిపారు. ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.










