కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా, పోలీస్ అభ్యర్థులకు ఉచిత పుస్తకాల పంపిణీ జిల్లా ఎస్పీ నితికా పంత్, IPS

0
20

కుమురం భీం ఆసిఫాబాద్ ప్రతినిధి (భారత్ ఆవాజ్ న్యూస్): పోలీస్ రిక్రూట్‌మెంట్‌లో స్థానిక అభ్యర్థులు విజయం సాధించేలా వారికి అవసరమైన నాణ్యమైన విద్యా, శారీరక శిక్షణతో పాటు నిరంతర మార్గదర్శకత్వం అందించడమే జిల్లా పోలీస్ శాఖ ముఖ్య లక్ష్యమని కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ నితికా పంత్, IPS గారు పేర్కొన్నారు. జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఉచిత రెసిడెన్షియల్ కోచింగ్ పొందుతున్న అభ్యర్థులకు శనివారం ఆమె చేతుల మీదుగా ప్రామాణికమైన స్టడీ మెటీరియల్‌ను (పుస్తకాలను) పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ, ప్రవేశ పరీక్షకు హాజరైన 2,700 మందిలో ప్రతిభ ఆధారంగా 150 మందిని ఎంపిక చేసి ఉచిత వసతి, భోజనం, విద్యా మరియు శారీరక శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు. అభ్యర్థుల ప్రగతిని అంచనా వేసేందుకు ఇప్పటికే 3 పరీక్షలు నిర్వహించామని, అంకగణితం, రీజనింగ్ సబ్జెక్టుల స్టడీ మెటీరియల్‌తో పాటు శారీరక దారుఢ్య పరీక్షలకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు.

ప్రతి వారం అభ్యర్థుల నుంచి అభిప్రాయాలను సేకరిస్తూ, వారు వెనుకబడిన అంశాలపై అదనపు తరగతులను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఆర్థికంగా వెనుకబడిన నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉద్యోగాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పోలీస్ ఉన్నతాధికారులు, మహిళా అధికారులు, సిబ్బంది మరియు అభ్యర్థులు పాల్గొన్నారు.