ఉప్పల్ జోన్‌లో SOT మెరుపు దాడులు నకిలీ వైద్యుల గుట్టురట్టు – ఐదుగురు అరెస్ట్

0
2

భారీగా వైద్య పరికరాలు, మందులు స్వాధీనం

హైదరాబాద్: ఉప్పల్ జోన్ స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ (SOT) పోలీసులు నకిలీ వైద్యులపై వరుస దాడులు నిర్వహించారు. మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నాచారం, ఉప్పల్, మేడిపల్లి పోలీస్ స్టేషన్‌ల పరిధిలో నిర్వహించిన ఈ దాడుల్లో అర్హతలు, చెల్లుబాటు అయ్యే వైద్య రిజిస్ట్రేషన్ లేకుండానే వైద్యం చేస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.

మల్లాపూర్ సూర్యనగర్‌లోని ఫస్ట్ ఎయిడ్ సెంటర్‌లో SSC వరకు చదివిన పుల్ల శ్రీనివాస్ను అదుపులోకి తీసుకుని, అతని వద్ద నుంచి స్టెతస్కోప్, డిజిటల్ బీపీ మానిటర్‌ను స్వాధీనం చేసుకున్నారు.

మల్లాపూర్ చౌదరి నగర్‌లో ఫస్ట్ ఎయిడ్ సెంటర్ నిర్వహిస్తున్న ఇస్మాయిల్ను కూడా పోలీసులు పట్టుకున్నారు. అతని వద్ద నుంచి స్టెతస్కోప్, బీపీ మానిటర్, థర్మామీటర్ స్వాధీనం చేసుకున్నారు.

మల్లాపూర్ మెయిన్ రోడ్‌లోని వెంకటరమణ కాలనీలో ఉన్న ‘రుద్రాక్ష మెడికల్ అండ్ జనరల్ స్టోర్’పై దాడి చేసి గంగుల సాయి తేజను అరెస్ట్ చేశారు. అతని వద్ద ప్రిస్క్రిప్షన్ బుక్లెట్, బీపీ మిషన్, స్టెతస్కోప్, థర్మామీటర్, సిరంజీలు, టెటనస్ వ్యాక్సిన్లు, వివిధ ఇంజెక్షన్లు, ఆల్ప్రాజోలం మాత్రలు తదితరాలను స్వాధీనం చేసుకున్నారు.

ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చిలకానగర్‌లో ‘షిఫా మెడికల్ షాప్ అండ్ ఫస్ట్ ఎయిడ్ సెంటర్’పై నిర్వహించిన దాడిలో షేక్ రహీమ్ను గుర్తించారు. అతని వద్ద నుంచి బీపీ మానిటర్, స్టెతస్కోప్, పల్స్ ఆక్సీమీటర్, సెలైన్ బాటిల్స్, ప్రిస్క్రిప్షన్లు, ఇంజెక్షన్లు, సిరంజీలు, IV క్యానులాలు, IV సెట్లు, సర్జికల్ కిట్లు, స్టాంపులు తదితర సామగ్రిని స్వాధీనం చేసుకుని ఉప్పల్ పోలీసులకు అప్పగించారు.

అదేవిధంగా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బోడుప్పల్ బొల్లిగూడెంలోని ‘శ్రీ లక్ష్మీ నరసింహ క్లినిక్’పై దాడి చేసి SSC వరకు చదివిన బోడ శ్యామ్ సుందర్ను అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి ప్రిస్క్రిప్షన్ బుక్లెట్, బీపీ మానిటర్, స్టెతస్కోప్, థర్మామీటర్‌తో పాటు వివిధ ఇంజెక్షన్లు, మాత్రలు, సిరంజీలు స్వాధీనం చేసుకున్నారు.

ఈ ఘటనలకు సంబంధించి సంబంధిత పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేసి, చట్టపరమైన చర్యలు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.

అర్హతలు, రిజిస్ట్రేషన్ లేకుండా వైద్యం చేస్తున్న వారిపై SOT ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నట్లు సమాచారం.