● మల్కాజిగిరి అధికారుల బ్యాడ్మింటన్‌లో సత్తా
● నర్సింహారెడ్డికి 2 గోల్డ్.. 1 సిల్వర్
● కాశిరెడ్డికి 2 గోల్డ్.. మొత్తం 4 స్వర్ణాలు
అల్వాల్, అక్టోబర్ 4: తెలంగాణ పోలీస్ 5వ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్–2026లో మల్కాజిగిరి కమిషనరేట్ అధికారులు బ్యాడ్మింటన్‌లో అదరగొట్టారు. డీసీపీ-ఎస్‌బీ G. నర్సింహారెడ్డి రెండు బంగారు పతకాలతో పాటు ఒక రజత పతకం సాధించగా, వనస్థలిపురం ఏసీపీ P. కాశిరెడ్డి రెండు బంగారు పతకాలు గెలుచుకున్నారు. ఇద్దరి విజయాలతో మల్కాజిగిరి ఖాతాలో బ్యాడ్మింటన్‌లో మొత్తం 4 బంగారు, 1 రజత పతకం చేరింది.
ఈసారి తెలంగాణ పోలీస్ గేమ్స్‌ను గతానికి భిన్నంగా Five-Cluster Modelలో నిర్వహించారు. దాదాపు 35 ఏళ్లుగా పోలీస్ క్రీడా పోటీలను ఒకే వేదికకు పరిమితం చేసే విధానానికి బదులుగా, వివిధ క్రీడలను వేర్వేరు క్లస్టర్లుగా విభజించారు. ఆల్ ఇండియా పోలీస్ గేమ్స్ తరహాలో రూపొందించిన ఈ విధానం ద్వారా పోలీస్ సిబ్బందికి మరింత విస్తృతంగా పోటీల్లో పాల్గొనే అవకాశం కల్పించడంతో పాటు ప్రతిభావంతులను తొలిదశలోనే గుర్తించి ఉన్నతస్థాయి పోటీలకు సిద్ధం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.
క్లస్టర్-Cలో బ్యాడ్మింటన్‌తో పాటు లాన్ టెన్నిస్, టేబుల్ టెన్నిస్ పోటీలను తెలంగాణ పోలీస్ అకాడమీ వేదికగా నిర్వహించారు. మూడు రోజుల పాటు జరిగిన ఈ పోటీల్లో కానిస్టేబుల్ స్థాయి నుంచి ఐపీఎస్ అధికారుల వరకు 700 మందికి పైగా పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. సెప్టెంబర్ 30న విజేతలకు డీజీపీ C.V. ఆనంద్ బహుమతులు అందజేశారు.
క్రీడల ప్రాధాన్యాన్ని వివరిస్తూ డీజీపీ సీవీ ఆనంద్ తన సందేశంలో “I may stop policing one day… but I will never stop playing sports” అని పేర్కొన్నారు. పోలీసింగ్ నుంచి ఒకరోజు వైదొలిగినా క్రీడలను మాత్రం కొనసాగిస్తానన్న ఆయన మాటలు పోలీస్ సిబ్బందిలో క్రీడల పట్ల ఉన్న ప్రాధాన్యాన్ని స్పష్టం చేశాయి. క్రీడలను శారీరక, మానసిక దృఢత్వానికి కీలకంగా భావిస్తున్న డీజీపీ.. ప్రతిరోజూ కనీసం ఒక గంట క్రీడలు లేదా వ్యాయామానికి కేటాయించాలని సూచించారు.
క్రీడాకారుల ప్రతిభను మరింతగా పెంచేందుకు సైంటిఫిక్ కోచింగ్, పోషకాహారం, ఫిజియోథెరపీ, ఫిట్‌నెస్ మేనేజ్‌మెంట్ వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలని డీజీపీ స్పష్టం చేశారు. క్రీడలు సమయం వృథా చేసే కార్యక్రమం కాదని, సమర్థవంతమైన పోలీసింగ్‌కు అవసరమైన శారీరక, మానసిక దృఢత్వాన్ని పెంచే సాధనమని ఆయన పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా, మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలోనే క్లస్టర్-A పోటీలను సారూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించారు. రెండు రోజుల పాటు జరిగిన ఈ పోటీల్లో తెలంగాణలోని 21 పోలీస్ యూనిట్ల నుంచి 831 మంది పాల్గొన్నారు. ఇందులో 683 మంది పురుషులు, 148 మంది మహిళలు ఉన్నారు. రెజ్లింగ్, బాక్సింగ్, బాడీబిల్డింగ్, ఆర్మ్ రెజ్లింగ్, వెయిట్‌లిఫ్టింగ్, పవర్‌లిఫ్టింగ్, యోగా, జూడో, వుషు, తైక్వాండో, కరాటే, పెన్కాక్ సిలాట్, ఫెన్సింగ్, జిమ్నాస్టిక్స్ సహా 14 ఇండోర్ క్రీడల్లో పోటీలు జరిగాయి.
క్లస్టర్-Aలో హైదరాబాద్ కమిషనరేట్ 140 పతకాలతో అగ్రస్థానంలో నిలవగా, టీజీఎస్పీ-2, మల్కాజిగిరి కమిషనరేట్ చెరో 58 పతకాలు సాధించాయి. మల్కాజిగిరి కమిషనరేట్ ఆధ్వర్యంలో క్లస్టర్-Aను సమర్థంగా నిర్వహించినందుకు డీజీపీ సీవీ ఆనంద్ సీపీ B. సుమతి, ఐపీఎస్ ను ప్రత్యేకంగా అభినందించారు.
తాజాగా బ్యాడ్మింటన్‌లో నర్సింహారెడ్డి, కాశిరెడ్డిలు సాధించిన పతకాలు మల్కాజిగిరి కమిషనరేట్ క్రీడా ప్రతిభకు మరో గుర్తింపుగా నిలిచాయి. ఇద్దరు అధికారులను సీపీ బి. సుమతి అభినందించారు. పోలీస్ విధుల్లో నిత్యం ఒత్తిడితో పనిచేసే సిబ్బందికి క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసాన్ని అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో, మల్కాజిగిరి అధికారులు సాధించిన ఈ విజయాలు ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
#Sidhumaroju
Alwal










