గత నాలుగు రోజులుగా ఆసిఫాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో కొనసాగుతున్న సానిటేషన్, పేషెంట్ కేర్, మరియు సెక్యూరిటీ సిబ్బంది సమ్మె ఎట్టకేలకు విరమించబడింది. (AITUC) ఆధ్వర్యంలో కార్మికులు తమ న్యాయమైన డిమాండ్ల కోసం ఈ నిరసన చేపట్టారు. కార్మికుల ప్రధాన సమస్యలైన పెండింగ్ వేతనాలు, ఈఎస్ఐ, ఈపీఎఫ్, అపాయింట్మెంట్ లెటర్లు, మరియు గుర్తింపు కార్డుల మంజూరుపై ఏజెన్సీ భీమ్ సొసైటీ నిర్వాహకులు, యూనియన్ నాయకుల మధ్య సుదీర్ఘ చర్చలు జరిగాయి. ఈ చర్చలు సఫలమవడంతో ఇరు వర్గాల మధ్య ఒప్పందం కుదిరింది.
యాజమాన్యం సమస్యల పరిష్కారానికి సానుకూలంగా స్పందించడంతో సమ్మెను విరమిస్తున్నట్లు ఏఐటీయూసీ జిల్లా నాయకులు చిరంజీవి అధికారికంగా ప్రకటించారు. దీంతో ఆసుపత్రిలో విధులు యథావిధిగా ప్రారంభం కానున్నాయి.










