మంచిర్యాల: కార్మికులు, పేదలు, అణగారిన వర్గాల అభ్యున్నతికి జీవితాంతం కృషి చేసిన కార్మిక పక్షపాతి, సామాజిక సేవకుడు గడ్డం వెంకటస్వామి(కాకా) జయంతి వేడుకలను సోమవారం ఐడీఓసీ సమావేశ మందిరంలో ఘనంగా నిర్వహించారు. షెడ్యూల్డ్ కులాల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి, జిల్లా సంక్షేమ శాఖ అధికారి, జిల్లా అల్పసంఖ్యాకుల సంక్షేమ అధికారి, జిల్లా కార్మిక శాఖ అధికారి, వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా డీసీపీ గడ్డం వెంకటస్వామి చిత్రపటానికి పూలమాల వేసి, జ్యోతి ప్రజ్వలన చేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన సేవలను స్మరించుకున్నారు.
కార్మికులకు కేవలం వేతనాలు మాత్రమే కాకుండా ‘డిగ్నిటీ ఆఫ్ లేబర్’ గౌరవం లభించాలనే భావనతో వెంకటస్వామి జీవితాంతం కృషి చేశారని డీసీపీ తెలిపారు. సమాజంలోని అసమానతలను రూపుమాపేందుకు ఆయన విశేషంగా కృషి చేశారన్నారు.
ప్రతి మనిషి మనుగడకు ఆహారం, దుస్తులు, నివాసం అత్యంత అవసరమని గుర్తించిన వెంకటస్వామి పేదలు, గుడిసెల్లో నివసించే ప్రజల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు చేపట్టారని పేర్కొన్నారు. జాతీయ గుడిసెల సంఘం ద్వారా పేదలకు నివాస సౌకర్యం కల్పించేందుకు కృషి చేసి, దాదాపు 30 కాలనీలలో ఇళ్ల ఏర్పాటుకు కృషి చేశారని తెలిపారు. ఆయన సేవలు పేద ప్రజల జీవితాల్లో గణనీయమైన మార్పును తీసుకువచ్చాయని అధికారులు కొనియాడారు.










