“షట్టర్‌ వంచి.. షోరూమ్‌ కొల్లగొట్టి.|

0
3

● అర్ధరాత్రి దాటిన తర్వాత షోరూమ్‌లోకి ప్రవేశం

● 300–400 బంగారు, వజ్రాభరణాలు మాయం

● క్లూస్‌ టీమ్‌, ఉప్పల్‌ జోన్‌ SOT రంగంలోకి

● సీసీ కెమెరాలతో నిందితుల కోసం గాలింపు

అల్వాల్, అక్టోబర్ 5: మల్కాజిగిరి కమిషనరేట్‌ పరిధిలోని ఉప్పల్‌ జోన్‌ మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో భారీ నగల చోరీ జరిగింది. హైదరాబాద్‌–వరంగల్‌ జాతీయ రహదారిపై మేడిపల్లి మెయిన్‌ రోడ్డులో ఉన్న కారట్‌లేన్‌ జ్యువెలరీ షోరూమ్‌ను దుండగులు టార్గెట్‌ చేశారు.

ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత షోరూమ్‌ షట్టర్‌ను వంచి లోపలికి ప్రవేశించిన దుండగులు డిస్‌ప్లే కేసులను ధ్వంసం చేసి బంగారు, వజ్రాభరణాలను ఎత్తుకెళ్లారు.

సోమవారం ఉదయం సుమారు 7 గంటల సమయంలో భవనం యజమాని షట్టర్‌ తెరిచి ఉండటాన్ని గుర్తించి షోరూమ్‌ ఫ్రాంచైజీ నిర్వాహకుడు కే. సుబ్రహ్మణ్యానికి సమాచారం అందించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

షోరూమ్‌లోని మహిళల బంగారు, వజ్రాభరణాల్లో సుమారు 300 నుంచి 400 పీసులు మాయమైనట్లు ప్రాథమికంగా గుర్తించారు. వీటిలో 9K, 14K, 18K కేటగిరీలకు చెందిన ఆభరణాలు ఉన్నట్లు నిర్వాహకుడు పోలీసులకు వివరించారు. షోరూమ్‌లో ప్లాటినం ఆభరణాల స్టాక్‌ లేదని వెల్లడైంది.

చోరీకి గురైన ఆభరణాల పూర్తి జాబితా, విలువపై ఇంకా లెక్కింపు కొనసాగుతోంది. మొత్తం నష్టాన్ని స్టాక్‌ వెరిఫికేషన్‌ పూర్తయిన తర్వాతే ఖచ్చితంగా నిర్ధారించనున్నారు.

ఘటనపై కేసు నమోదు చేసిన మేడిపల్లి పోలీసులు క్లూస్‌ టీమ్‌తో ఆధారాలు సేకరించారు. ఉప్పల్‌ జోన్‌ DCP కే. సురేష్‌ కుమార్‌, మేడిపల్లి ACP బి. మోహన్‌ కుమార్‌, మేడిపల్లి ఇన్‌స్పెక్టర్‌ డి. జలేందర్‌ రెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఉప్పల్‌ SOT కూడా దర్యాప్తులో భాగమైంది.

షోరూమ్‌లోని సీసీ కెమెరాలతో పాటు పరిసర ప్రాంతాల్లోని కెమెరాల ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. 

దుండగులు షోరూమ్‌లోకి ఏ మార్గంలో ప్రవేశించారు, ఎంతమంది ఉన్నారు, చోరీ అనంతరం ఏ దిశగా పరారయ్యారనే అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది. 

నిందితులను గుర్తించి పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి.

#sidhumaroju

Alwal