Madanapalle: ప్రముఖ పుణ్యక్షేత్రం బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవో ఏకాంబరాన్ని తక్షణమే సస్పెండ్ చేయడంతో పాటు, టెండర్‌దారుడిపై దాడి ఘటనపై ప్రత్యేక కమిటీతో సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. చౌడపల్లికి చెందిన ఓ. వెంకట్ యాదవ్ ఆధ్వర్యంలో సోమవారం మదనపల్లెలో మీడియాతో మాట్లాడుతూ ఆలయంలో టెండర్ ప్రక్రియ పూర్తికాకముందే సుమారు 70 శాతం పనులు జరిగినట్లు ఆరోపించారు. దీనిపై వర్క్ ఆర్డర్లు, బిల్లులను పరిశీలించి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని కోరారు. అలాగే టోల్ రుసుముల వ్యవహారంపైనా సమగ్ర విచారణ చేపట్టాలని, ఆలయ వ్యవహారాల్లో రాజకీయ జోక్యాన్ని అరికట్టాలని జిల్లా కలెక్టర్‌కు సమర్పించిన వినతిపత్రంలో కోరినట్లు తెలిపారు.










