మంత్రి, ఎంపీ తీరుపై ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు వర్గీయుల ఆగ్రహం

0
1

మంచిర్యాల: మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీ వంశీకృష్ణ తమ పద్ధతిని మార్చుకోవాలని, లేనిపక్షంలో జగన్మోహన్ రావు వర్గంపై కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదు చేసి పార్టీ నుంచి బహిష్కరించేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు వర్గీయులు హెచ్చరించారు. మంగళవారం ఎమ్మెల్యే నివాసంలో మంచిర్యాల మేయర్ మధుకర్, మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు తూముల నరేష్, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు పూదరి తిరుపతి మీడియాతో మాట్లాడారు.మంచిర్యాల అభివృద్ధిని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు వేగంగా ముందుకు తీసుకెళ్తున్నారని, దీనిని జీర్ణించుకోలేకనే మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీ వంశీకృష్ణ వర్గపోరుకు తెరలేపుతున్నారని వారు ఆరోపించారు. కాంగ్రెస్ కండువా కప్పుకోని మంతెన జగన్మోహన్ రావు కాంగ్రెస్ పార్టీలో విభేదాలు సృష్టించేలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ ఇంచార్జ్ మంత్రి, రాష్ట్ర పీసీసీకి ఫిర్యాదు చేస్తామని తెలిపారు.ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావును నేరుగా ఎదుర్కొనే ధైర్యం లేకనే కొందరు ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడుతున్నారని వారు ఆరోపించారు. మిత్రపక్షాలతో పాటు ప్రతిపక్షాలు కూడా ఎమ్మెల్యేపై రాజకీయంగా దాడి చేస్తున్నాయని అన్నారు. ఎమ్మెల్యే వద్ద ఇలాంటి రాజకీయాలు చెల్లవని పేర్కొన్నారు.ఎంపీ లాడ్స్ నిధులను కేవలం ఒకటి, రెండు డివిజన్లకే కేటాయించడం సరికాదని, అన్ని డివిజన్ల ప్రజల ఓట్లతోనే ఎంపీ విజయం సాధించారని వారు వ్యాఖ్యానించారు. కార్పొరేషన్ పరిధిలో నిర్వహించే కార్యక్రమాలకు ప్రథమ పౌరుడైన మేయర్, డిప్యూటీ మేయర్‌తో పాటు ఏఎంసీ చైర్మన్‌ల ఫొటోలను ఫ్లెక్సీల్లో పెట్టకపోవడంపై వారు అభ్యంతరం వ్యక్తం చేశారు.కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో లేని సమయంలో సైతం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పార్టీని బలోపేతం చేయడంలో ప్రేమ్ సాగర్ రావు కీలకంగా పనిచేశారని వారు పేర్కొన్నారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పాదయాత్ర, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమావేశం, ఇంద్రవెల్లి సభ తదితర కార్యక్రమాలను విజయవంతం చేయడంలో ఆయన పాత్ర ఉందన్నారు.కాంగ్రెస్ పార్టీకి చెందిన సర్పంచులు, కార్పొరేటర్లను కొందరు భయభ్రాంతులకు గురిచేస్తున్నారని వారు ఆరోపించారు. మంచిర్యాల అభివృద్ధికి కృషి చేస్తున్న ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుకు మంత్రి పదవి ఇవ్వాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు.