గోపాలపట్నం జడ్పీ హైస్కూల్‌లో ఆర్‌ఓ వాటర్ ప్లాంట్, డైనింగ్ హాల్ గ్రిల్స్ మరియు విద్యుద్దీకరణ పనుల ప్రారంభించిన ప్రభుత్వ విప్ గణబాబు

0
1

గోపాలపట్నంలోని ఎస్వీఎల్‌ఎన్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎస్‌ఎన్‌ఎఫ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (SNF India Pvt Ltd) కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) కింద ఏర్పాటు చేసిన ఆర్‌ఓ రక్షిత మంచినీటి ప్లాంట్, గ్రిల్స్ మరియు డైనింగ్ హాల్ విద్యుద్దీకరణ పనులను ప్రభుత్వ విప్ మరియు ఎమ్మెల్యే గణబాబు గారు ఘనంగా ప్రారంభించారు.

​ఈ సందర్భంగా గణబాబు గారు మాట్లాడుతూ — తాను ఇదే పాఠశాలలో చెట్ల కింద కూర్చుని చదువుకున్న పూర్వ విద్యార్థిని అని గుర్తుచేసుకున్నారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన తాను ఈ పాఠశాలను ఆదర్శవంతమైన మోడల్ స్కూల్‌గా తీర్చిదిద్దేందుకు కృషి చేశానని, దేశంలోనే అరుదుగా జడ్పీ స్కూల్ ప్రాంగణంలో కర్ణం మల్లేశ్వరి బ్లాక్, ఇండోర్ స్టేడియంను కూడా ఏర్పాటు చేశామని తెలిపారు.

 ​ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కేవలం ప్రభుత్వ నిధులతోనే కాకుండా, కార్పొరేట్ సంస్థల సహకారం, పూర్వ విద్యార్థుల భాగస్వామ్యంతోనే వేగవంతమవుతుందని ఆయన అన్నారు. ఇదే పాఠశాలలో చదివి ప్రస్తుతం ఎస్‌ఎన్‌ఎఫ్ సంస్థలో ఉన్నత స్థానంలో ఉన్న పూర్వ విద్యార్థి చొరవతో ఈ వసతులు సమకూరడం అభినందనీయమని కొనియాడారు. ఎస్‌ఎన్‌ఎఫ్ సంస్థ పాఠశాల అభివృద్ధికి సహకరించడం పట్ల యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేశారు. చదువుకున్న పాఠశాలను, కన్న తల్లిని, పుట్టిన ఊరిని ఏ స్థాయిలో ఉన్నా మర్చిపోకూడదని విద్యార్థులకు పిలుపునిచ్చారు.

 ​ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎస్‌ఎన్‌ఎఫ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ రాజేంద్రన్ కుమారేశన్, డైరెక్టర్ జాన్ డెనియర్, డీఈఓ ప్రేమ్ కుమార్, సంస్థ ప్రతినిధులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు.