చదువుకు చేయూతనిస్తున్న దీపిక గిరిజన గళం – గ్రూప్‌–2 విద్యార్థులకు పుస్తకాల పంపిణీ.

0
2

ఆర్థిక పరిస్థితులు చదువుకు అడ్డంకిగా మారకూడదనే ఉద్దేశంతో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు దీపిక గిరిజన గళం అండగా నిలిచింది. దీపిక గిరిజన గళం చైర్మన్ దీపికా ఆధ్వర్యంలో, లైన్స్ క్లబ్ సహకారంతో గ్రూప్‌–2 పరీక్షకు సిద్ధమవుతున్న విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. చింతూరు ప్రాంతానికి చెందిన నలుగురు విద్యార్థులకు, భద్రాచలం ప్రాంతంలో గ్రూప్‌–2 పరీక్షకు సిద్ధమవుతున్న ఆరుగురు విద్యార్థులకు అవసరమైన పుస్తకాలు, స్టడీ మెటీరియల్ అందించారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు పుస్తకాలు ఎంతో అవసరమని, ఆర్థిక ఇబ్బందుల కారణంగా చదువుకు ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతో ఈ సహాయం అందిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.“అక్షరం అందరి ఆస్తి విద్య అందరి హక్కు” అనే నినాదంతో విద్యార్థులను చదువువైపు ప్రోత్సహించడంతో పాటు, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే యువతకు తమ వంతు సహకారం అందిస్తామని దీపిక గిరిజన గళం ప్రతినిధులు తెలిపారు. పుస్తకాల కోసం సహకరించిన లైన్స్ క్లబ్ సభ్యురాలు ఉషారాణి, శివ పరమేశ్వరి తదితరులకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. చదువుకు చేయూత అందించే కార్యక్రమాలను కొనసాగిస్తామని పేర్కొన్నారు.

 

# Yadagiri