న్యాయం కోసం దిక్కుతోచని స్థితిలో చిన్నారితో తల్లి ఆవేదన: భర్త, అత్త వేధింపులపై మహిళా స్టేషన్, వన్ స్టాప్ సెంటర్‌లో ఫిర్యాదు.

0
0

నెల్లూరు / సంగం / మర్రిపాడు:

న్యాయం చేయాల్సిన చోట ఆదరణ కరువై, గృహ హింసకు గురవుతున్న ఒక బాధితురాలు తన చిన్నారితో కలిసి న్యాయం కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్న ఉదంతం నెల్లూరు జిల్లాలో వెలుగు చూసింది.

కేసు వివరాలు:

నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం బొంతమరిపల్లె గ్రామానికి చెందిన గుడిమెట్ల వసుంధర అనే మహిళకు, సంగం మండలం హరిజనవాడ గ్రామానికి చెందిన గుడిమెట్ల బాలచంద్రతో దాదాపు 6 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి ఒక పాప ఉంది.

గత 4 సంవత్సరాలుగా కుటుంబంలో తీవ్ర వివాదాలు నడుస్తున్నాయి. భర్త బాలచంద్ర మరొక మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని, భార్య వసుంధరపై తీవ్రమైన శారీరక దాడికి పాల్పడ్డాడని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. ఈ వేధింపుల్లో భర్తతో పాటు అత్త, ఇతర కుటుంబ సభ్యులు (శిరీష తదితరులు) కలిసి తనపై తీవ్రంగా దాడి చేసి, ఇంట్లో నుంచి వెళ్లగొట్టారని బాధితురాలు పేర్కొంది.

పెద్దమనుషుల పంచాయితీ – పోలీసుల చుట్టూ తిరిగినా దక్కని న్యాయం:

బాధితురాలు న్యాయం కోసం సంగం గ్రామానికి చెందిన పెద్దమనిషి రవీంద్రా రెడ్డిని ఆశ్రయించగా, ఆయన సమస్యను పరిష్కరించకపోగా “మీకు నేను చెప్పలేను, 10 సెంట్ల పొలం తీసుకుని విడిపోండి” అని చెప్పినట్లు బాధితురాలు తెలిపింది.

న్యాయం కోసం తన చిన్నారితో కలిసి మర్రిపాడు పోలీస్ స్టేషన్, సంగం పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో, బాధితురాలు నెల్లూరు జిల్లా స్థాయి అధికారులను ఆశ్రయించింది.

జిల్లా స్థాయి అధికారులకు ఫిర్యాదు:

గత మూడు రోజులుగా జిల్లా మహిళా పోలీస్ స్టేషన్ అధికారులను కలిసిన వసుంధర, 07/10/2026 న నెల్లూరు జిల్లా మహిళా మరియు శిశు అభివృద్ధి సంస్థ (వన్ స్టాప్ సెంటర్ / సాకి) లో తన భర్త, అత్త మరియు ఇతర కుటుంబ సభ్యులపై రాతపూర్వక ఫిర్యాదు అందజేసింది. 

తనకు మరియు తన చిన్నారికి రక్షణ కల్పించి, గృహ హింసకు పాల్పడిన భర్త, అత్తమామలపై కఠిన చర్యలు తీసుకుని బాధ్యులకు శిక్ష పడేలా చూసి, తనకు న్యాయం చేయాలని ఆ తెలుగు ఆడబిడ్డ ఉన్నతాధికారులను, ప్రజాసంఘాలను వేడుకుంటోంది.