మంచిర్యాల: రోడ్డు ప్రమాదాల నివారణ, బ్లాక్ స్పాట్ల గుర్తింపు, ట్రాఫిక్ నియంత్రణకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని మంచిర్యాల డీసీపీ ఎ.భాస్కర్ సూచించారు. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు డీసీపీ కార్యాలయంలో సంబంధిత శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రమాదకర మలుపులు, కూడళ్లు, రద్దీ ప్రాంతాలు, తరచూ ప్రమాదాలు జరిగే ప్రదేశాలను గుర్తించి రంబుల్ స్టిక్స్, హెచ్చరిక బోర్డులు, ట్రాఫిక్ సిగ్నల్స్, బారికేడ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. బై-లేన్ రోడ్లు ప్రధాన రహదారుల్లో కలిసే ప్రాంతాల్లో వేగ నియంత్రణ చర్యలు చేపట్టాలని ఆర్అండ్బీ, మున్సిపల్, జాతీయ రహదారుల శాఖల అధికారులను ఆదేశించారు.మంచిర్యాల పట్టణంలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ, నిబంధనల అమలు, ఎన్ఫోర్స్మెంట్ చర్యలపై చర్చించారు. ట్రాఫిక్ నియంత్రణ కేవలం ట్రాఫిక్ పోలీసుల బాధ్యత కాదని, లా అండ్ ఆర్డర్ పోలీసులు కూడా ఎన్ఫోర్స్మెంట్లో భాగస్వాములు కావాలని డీసీపీ సూచించారు.అనంతరం మంచిర్యాల, శ్రీరాంపూర్ పరిధిలోని బ్లాక్ స్పాట్లను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, ప్రమాదాలకు కారణాలను గుర్తించారు. సమావేశంలో ఏసీపీ ఆర్.ప్రకాష్, పోలీసు అధికారులు, ఆర్అండ్బీ, మున్సిపల్, జాతీయ రహదారుల శాఖల అధికారులు పాల్గొన్నారు.










