25 ఏళ్ల ప్రస్థానం.. “We Will Do It”.|

0
5

● సేవా సంకల్ప్ అభియాన్‌లో భాగంగా సేవా జ్యోతి కలశ యాత్ర

● మోదీ ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించిన బీజేపీ శ్రేణులు

● 2047 వికసిత్ భారత్ నుంచి ఆత్మనిర్భర్ భారత్ వరకు.. భవిష్యత్ లక్ష్యాలను వివరించిన మోదీ

అల్వాల్, అక్టోబర్ 07: ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వాధినేతగా 25 ఏళ్ల ప్రస్థానం పూర్తి చేసుకున్న సందర్భంగా బీజేపీ దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ‘సేవా సంకల్ప్ అభియాన్’లో భాగంగా సేవా జ్యోతి కలశ యాత్రను అల్వాల్‌లో ఘనంగా నిర్వహించారు. 

డైరీ ఫార్మ్ రోడ్డులోని శోభా గార్డెన్స్‌లో మేడ్చల్–మల్కాజ్‌గిరి (అర్బన్) జిల్లా బీజేపీ అధ్యక్షుడు డి. గిరివర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం ఉదయం జరిగిన కార్యక్రమానికి మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

కార్యక్రమంలో భాగంగా శోభా గార్డెన్స్‌లో బీజేపీ పదాధికారులు, నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువత, పార్టీ అభిమానులు ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. 

25 ఏళ్ల సుదీర్ఘ ప్రభుత్వాధినేత ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా మోదీ చేసిన ప్రసంగం గతాన్ని గుర్తుచేసుకోవడంతో పాటు భవిష్యత్ భారత్‌కు దిశానిర్దేశం చేసేలా సాగింది. తన 25 ఏళ్ల ప్రయాణం ప్రజల విశ్వాసం, కార్యకర్తల కృషి, దేశ ప్రజల ఆశీస్సులతో సాగిందని మోదీ పేర్కొన్నారు.

2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలనే లక్ష్యాన్ని మోదీ మరోసారి స్పష్టం చేశారు. ప్రపంచంలోని టాప్-3 ఆర్థిక వ్యవస్థల్లో భారత్‌ను నిలపడం, ఆత్మనిర్భర్ భారత్‌ను మరింత బలోపేతం చేయడం, భారత్‌ను ప్రపంచ తయారీ కేంద్రంగా తీర్చిదిద్దడం, ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వడం, అంతరిక్ష రంగంలో మరింత ముందుకు వెళ్లడం వంటి లక్ష్యాలను ప్రస్తావించారు. ప్రతి లక్ష్యాన్ని సాధించాలనే సంకల్పాన్ని వ్యక్తం చేస్తూ “We Will Do It” అని మోదీ పిలుపునివ్వగా.. సభలోని ప్రజలు కూడా అదే మాటను ప్రతిధ్వనించారు.

దేశం చిన్న లక్ష్యాలతో సంతృప్తి చెందే పరిస్థితిలో లేదని, భారతదేశ సామర్థ్యానికి తగిన పెద్ద లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని సాధించాల్సిన సమయం ఇదేనని మోదీ పేర్కొన్నారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించేందుకు దూరదృష్టితో కూడిన విధానాలు, నిరంతర శ్రమ, సమష్టి సంకల్పం అవసరమని స్పష్టం చేశారు. 25 ఏళ్ల అనుభవం నుంచి వచ్చిన శక్తితో మరింత పెద్ద లక్ష్యాల వైపు దేశం ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

మోదీ ప్రసంగాన్ని ప్రత్యక్షంగా వీక్షిస్తున్న సమయంలోనే శోభా గార్డెన్స్‌లో బీజేపీ శ్రేణులు “భారత్ మాతాకీ జై.. వందేమాతరం.. జై బీజేపీ.. జై నరేంద్ర మోదీ” అంటూ నినాదాలు చేయడంతో పరిసరాల్లో ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది.

2001 అక్టోబర్ 7న గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ.. 2014లో దేశ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు.

ప్రస్తుతం మూడోసారి ప్రధానమంత్రిగా కొనసాగుతున్న ఆయన ప్రభుత్వాధినేతగా నిరంతరంగా 25 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నారు. 

2001 అక్టోబర్ 7 నుంచి 2026 అక్టోబర్ 7 వరకు సాగిన ఈ ప్రయాణం 25 సంవత్సరాలు, 300 నెలలు, 9,131 రోజులకు చేరుకుంది.

ఈ 25 ఏళ్లలో దేశ పరిపాలనలో పలు రంగాల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. జన్‌ధన్, ఆధార్, మొబైల్ అనుసంధానం ద్వారా సంక్షేమ పథకాల లబ్ధి చేరవేతలో మార్పులు వచ్చాయి.

యూపీఐ ద్వారా డిజిటల్ చెల్లింపులు సామాన్యుల దైనందిన జీవితంలో భాగమయ్యాయి. జీఎస్టీ ద్వారా దేశవ్యాప్తంగా పరోక్ష పన్నుల వ్యవస్థలో మార్పు తీసుకొచ్చారు. నోట్ల రద్దు వంటి నిర్ణయాలు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసినప్పటికీ.. నగదు ఆధారిత ఆర్థిక వ్యవస్థ, నల్లధనం, డిజిటల్ లావాదేవీలపై పెద్ద చర్చకు కారణమయ్యాయి.

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కుదిపేసిన సమయంలో దేశీయ వ్యాక్సిన్ అభివృద్ధికి కేంద్రం మద్దతు ఇవ్వడం, విస్తృత వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టడం కీలక పరిణామాలుగా నిలిచాయి. 

చంద్రయాన్-3 విజయంతో పాటు ప్రైవేట్ రంగానికి అంతరిక్ష రంగంలో అవకాశాలు కల్పించడం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ వంటి రంగాలపై దృష్టి సారించడం ద్వారా శాస్త్ర, సాంకేతిక సామర్థ్యాన్ని విస్తరించే ప్రయత్నాలు జరిగాయి.

దేశ భద్రత విషయంలోనూ ఈ కాలంలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఆర్టికల్ 370 రద్దు, సర్జికల్ స్ట్రైక్స్, బాలాకోట్ వైమానిక దాడులు, ఆపరేషన్ సిందూర్ వంటి పరిణామాలతో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత ప్రతిస్పందనలో మార్పు కనిపించింది. రక్షణ రంగంలో స్వదేశీ తయారీ, పరిశోధన, సాంకేతికత, రక్షణ ఎగుమతులపై దృష్టి పెంచుతూ ఆత్మనిర్భరత వైపు అడుగులు వేశారు. రక్షణ సామర్థ్యాన్ని దేశీయ సాంకేతికత, పరికరాలు, తయారీ సామర్థ్యంతో మరింత బలోపేతం చేసే దిశగా చర్యలు సాగాయి.

ఇళ్ల నిర్మాణం, తాగునీరు, ఆరోగ్య సేవలు, బ్యాంకింగ్, మౌలిక వసతులు, తయారీ రంగం, స్టార్టప్‌లు, డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వంటి రంగాల్లోనూ అనేక కార్యక్రమాలు అమల్లోకి వచ్చాయి. 

కరోనా, యుద్ధాలు, ఇంధన సంక్షోభం వంటి అంతర్జాతీయ సవాళ్ల మధ్య భారత ఆర్థిక వ్యవస్థను నిలబెట్టుకోవడం, స్వదేశీ సామర్థ్యాన్ని పెంచుకోవడం వంటి అంశాలకు కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చింది.

ఇలాంటి 25 ఏళ్ల అనుభవాన్ని వెనక్కి చూసిన మోదీ.. ఇక మరింత పెద్ద లక్ష్యాల వైపు దేశం ముందుకు సాగాల్సిన సమయం ఇదేనని స్పష్టం చేశారు. భారతదేశం తన సామర్థ్యానికి తగిన లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని సాధించాలన్నారు. 2047 నాటికి వికసిత్ భారత్‌ను నిర్మించాలనే లక్ష్యంతో “We Will Do It” అనే సంకల్పంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ..25 ఏళ్లుగా గొప్ప రాజకీయ దక్షతతో సుదీర్ఘ ప్రజాసేవ చేసిన మహానాయకుడు ప్రధాని నరేంద్ర మోదీ అని అన్నారు. దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగుతున్న దార్శనిక నాయకుడిగా మోదీని అభివర్ణించారు. దేశ ప్రజలు, ఎన్డీఏ మిత్రపక్షాలు అందించిన సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు.

వికసిత్ భారత్ సంకల్ప సభలో మోదీ ఇచ్చిన సందేశాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించిన వారిని ఈటల అభినందించారు. ప్రధాని సందేశాన్ని, ఆయన సంకల్పాన్ని ప్రతి కార్యకర్త విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని, కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించి వికసిత్ భారత్ లక్ష్య సాధనలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు.

కార్యక్రమంలో భాగంగా శోభా గార్డెన్స్ నుంచి సేవా జ్యోతి కలశ యాత్ర ప్రారంభమై శివాజీ చౌక్, కనాజిగూడ పెట్రోల్ బంక్ వరకు కొనసాగింది. పార్టీ నాయకులు, పదాధికారులు, కార్యకర్తలు ఉత్సాహంగా యాత్రలో పాల్గొన్నారు.

కార్యక్రమంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత చింతల వెంకట్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఎన్.వి.ఎస్.ఎస్. ప్రభాకర్, బేతి సుభాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధులు గాండే సుధాకర్, తాడూరి శ్రీనివాస్, రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు డా. మేకల శిల్ప రెడ్డి, రాష్ట్ర గిరిజన మోర్చా అధ్యక్షుడు రవి నాయక్, మాజీ జిల్లా అధ్యక్షుడు డా. ఎస్. మల్లారెడ్డి, సీనియర్ నాయకుడు వడేపల్లి రాజేశ్వర్ రావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆర్కే శ్రీనివాస్, గురుదే కృష్ణ, చింతల మాణిక్ రెడ్డి, గోపు రమణారెడ్డి, బ్రహ్మచారి, మాధవి, యం.ఎస్. వాసు, తిరుపతి యాదవ్ పాల్గొన్నారు.

జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు ధనలక్ష్మి, ఓబీసీ మోర్చా అధ్యక్షుడు జేకే శేఖర్ యాదవ్, యువ మోర్చా అధ్యక్షుడు శ్రీనాథ్, కిసాన్ మోర్చా అధ్యక్షుడు మల్లేష్ యాదవ్, ఎస్సీ మోర్చా అధ్యక్షుడు సుధాకర్, ఎస్టీ మోర్చా అధ్యక్షుడు వెంకటేష్ నాయక్, రాష్ట్ర మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి అరకల సుధా, మాజీ కార్పొరేటర్లు బండారు శ్రావణి, ఊరపల్లి శ్రావణ్ కుమార్, క్యానం రాజ్యలక్ష్మి, గున్నాల సునీత శేఖర్ యాదవ్, మహేందర్, రావుల శేషగిరి రావు, విజయలక్ష్మి సుబ్బారావు, సీనియర్ నాయకులు దేవసాని బాలచందర్, ఉడుత నవీన్, జి. బాలచందర్ గౌడ్, జీ. రమేష్‌, సూర్య, రాజిరెడ్డి, లక్ష్మణ్‌తో పాటు పలువురు నాయకులు, పదాధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇంత గొప్ప కార్యాన్ని నిర్వహించిన అల్వాల్ బిజెపి శ్రేణులకు ధన్యవాదాలు.

#Sidhumaroju✍️

Alwal