ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష, హార్ట్ ఫుల్ నెస్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని కాన్హా శాంతివనంలో నిర్వహించిన మూడు రోజుల కెపాసిటీ బిల్డింగ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఆన్ యోగా కార్యక్రమానికి రోలుగుంట మండలం నుంచి యోగా ఉపాధ్యాయుడు ఎన్ గోవిందు, ఆంగ్ల ఉపాధ్యాయిని పివిఎం నాగజ్యోతి హాజరై శిక్షణ పొందారు.రాష్ట్రంలోని పీఎంశ్రీ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు విద్యార్థుల శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం, ఏకాగ్రత, భావోద్వేగ సమతుల్యత, క్రమశిక్షణను పెంపొందించే లక్ష్యంతో ఈ శిక్షణను నిర్వహించారు. మూడు రోజుల పాటు రెసిడెన్షియల్ విధానంలో జరిగిన ఈ శిక్షణలో వివిధ యోగాసనాలు, ప్రాణాయామం, ధ్యానం, శ్వాసాభ్యాసాలు తదితర అంశాల్లో ఉపాధ్యాయులకు ప్రత్యక్ష శిక్షణ అందించారు.రోలుగుంట మండలం నుంచి పివిఎం నాగజ్యోతి, ఎన్ గోవింద్ లు శిక్షణలోని వివిధ సెషన్లలో చురుకుగా పాల్గొని యోగా బోధనా విధానాలను అభ్యసించారు. శిక్షణను విజయవంతంగా పూర్తి చేసిన సందర్భంగా వారికి ధ్రువీకరణ పత్రాలను అందజేశారు.ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ కాన్హా శాంతి వనంలో పొందిన శిక్షణ తమకు ఎంతో ఉపయోగకరంగా ఉందని తెలిపారు. శిక్షణలో నేర్చుకున్న యోగా, ధ్యానం, హార్ట్ ఫుల్ నెస్ పద్ధతులను తమ పాఠశాలల్లో విద్యార్థులకు అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. ప్రతి విద్యార్థి దినచర్యలో యోగాను ఒక భాగంగా మార్చి, వారిలో ఏకాగ్రత, మానసిక స్థైర్యం, ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, భావోద్వేగ సమతుల్యత పెంపొందించేలా కృషి చేస్తామని తెలిపారు.










