పరిశుభ్రతతోనే వ్యాధుల నియంత్రణ : జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్

0
1

మంచిర్యాల, అక్టోబర్ 8: స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా ఆసుపత్రులు, ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలు, పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రతను పాటిస్తూ వ్యాధుల నియంత్రణకు చర్యలు చేపట్టాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ సూచించారు.గురువారం ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ అనిల్ కుమార్‌తో కలిసి కుందారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, గంగిపల్లి ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత, బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణపై అవగాహన కల్పించారు.జిల్లాలో అక్టోబర్ 2 నుంచి 31 వరకు నిర్వహిస్తున్న స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానాలు, ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాల్లో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. ఉపయోగపడని వస్తువులను తొలగించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, బయోమెడికల్ వ్యర్థాలను నిబంధనల ప్రకారం నిర్వహించాలని సూచించారు.వాతావరణ మార్పుల నేపథ్యంలో మలేరియా, డెంగ్యూ, చికున్‌గున్యా తదితర కీటక జనిత వ్యాధులు, వైరల్ జ్వరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని, అవసరమైన ప్రాంతాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఆశా కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి జ్వరాలు, వ్యాధుల లక్షణాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు.అదేవిధంగా క్షయ వ్యాధిగ్రస్తులను గుర్తించి నమోదు చేయడంతో పాటు చికిత్స, మందుల వినియోగంపై అవగాహన కల్పించాలని, 30 ఏళ్లు పైబడిన వారిలో బీపీ, షుగర్ వంటి అసంక్రమణ వ్యాధులను గుర్తించి పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. ప్రతి బుధవారం, శనివారం నిర్వహించే టీకా కార్యక్రమాల్లో పిల్లలందరికీ సకాలంలో టీకాలు అందేలా చర్యలు తీసుకోవాలని, గర్భిణుల 100 శాతం నమోదు చేయాలని సూచించారు.గంగిపల్లి ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రంలో అందుతున్న వైద్య సేవలపై డీఎంహెచ్‌ఓ సంతృప్తి వ్యక్తం చేశారు. అవగాహన కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా మాస్ మీడియా అధికారి బుక్కా వెంకటేశ్వర్, వైద్యులు డాక్టర్ శ్రావ్య, డాక్టర్ వేదశ్రీ, సిబ్బంది రేపక కస్తూరి సాయి, ఆశా ఆరోగ్య కార్యకర్తలు పాల్గొన్నారు.