🟢చందాపురం జెడ్పీ పాఠశాలలో బతుకమ్మ పోటీలు
నందిగామ, అక్టోబర్ 9,bharat aawaz :
🟢దసరా శరన్నవరాత్రులను పురస్కరించుకుని నందిగామ మండలం చందాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు బతుకమ్మ పోటీలు నిర్వహించారు. హెచ్ఎం అట్లూరి రాజశేఖర్ పర్యవేక్షణలో శుక్రవారం నిర్వహించిన ఈ పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
🟢24 గంటల శ్రమతో భారీ బతుకమ్మ
పదో తరగతి విద్యార్థి ఉదయ్ కుమార్ బృందం సుమారు 24 గంటల పాటు శ్రమించి 12 అడుగుల భారీ బతుకమ్మను సర్వాంగ సుందరంగా రూపొందించింది. రంగురంగుల పూలతో అందంగా తీర్చిదిద్దిన ఈ బతుకమ్మ తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులను విశేషంగా ఆకట్టుకుంది.
🟢విజేతలకు బహుమతులు
పోటీల్లో ఉదయ్ కుమార్ మొదటి స్థానం, పూజిత రెండో స్థానం, బాల సునంద మూడో స్థానం సాధించారు. విజేతలకు హెచ్ఎం అట్లూరి రాజశేఖర్, ఉపాధ్యాయురాలు కొత్త నాగలక్ష్మి, ఇతర ఉపాధ్యాయులు బహుమతులు అందజేశారు. మరో ముగ్గురికి ప్రోత్సాహక బహుమతులు అందించినట్లు హెచ్ఎం తెలిపారు. పోటీల్లో పాల్గొన్న విద్యార్థులను అభినందించారు.
🟢తపస్వి పాఠశాలలో దసరా వేడుకలు
చందాపురం శివారులోని శ్రీ తపస్వి పాఠశాలలోనూ దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థిని శాఖమూరి రుషిత నవదుర్గల వేషధారణతో చేసిన ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది.










