గోపాలపట్నంలోని కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించిన ప్రభుత్వ విప్, విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు పి.జి.వి.ఆర్. నాయుడు (గణబాబు) మాట్లాడారు
• సుప్రీంకోర్టు తీర్పు – ప్రభుత్వ చిత్తశుద్ధి:
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పిస్తూ కూటమి ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం. 105, 1065లను సుప్రీంకోర్టు కొట్టివేయడంపై ఆయన స్పందించారు. రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదనే నిబంధన ఉన్నప్పటికీ, రాజీవ్ రంజన్ మిశ్రా కమిటీ రిపోర్ట్‌తో పాటు అవసరమైన ఎంపిరికల్ డేటాను కోర్టులకు సమర్పించి, బీసీ మంత్రులు ఢిల్లీకి వెళ్లి సీనియర్ న్యాయవాదులతో చర్చలు జరిపి కూటమి ప్రభుత్వం పూర్తి చిత్తశుద్ధితో న్యాయపోరాటం చేసిందని గుర్తుచేశారు.
• బీసీల రాజకీయ ఎదుగుదలకు టీడీపీనే ఆద్యం:
స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు లేవని, 1987లో నందమూరి తారకరామారావు గారు తొలిసారిగా పంచాయతీలు, మండల పరిషత్తులు, మున్సిపాలిటీల్లో బీసీలకు 20% రిజర్వేషన్లు కల్పించారని పేర్కొన్నారు. ఆ తర్వాత విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు 1997లో దానిని 34 శాతానికి పెంచి స్థానిక ఎన్నికలు నిర్వహించారని, వైఎస్సార్, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాలు కూడా అదే రిజర్వేషన్లను కొనసాగించాయని తెలిపారు.
• గత వైసీపీ ప్రభుత్వ ద్రోహం:
2019లో అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం 34 శాతంగా ఉన్న రిజర్వేషన్లను ఏకపక్షంగా 24 శాతానికి తగ్గించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనివల్ల రాష్ట్రవ్యాప్తంగా సుమారు 16,800 మంది బీసీలు ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు అయ్యే అవకాశాన్ని కోల్పోయారని మండిపడ్డారు. ఏ కమిటీ సూచనల మేరకు, ఎందుకు తగ్గించారో నేటికీ వైసీపీ నాయకులు ప్రజలకు సమాధానం చెప్పలేకపోతున్నారని విమర్శించారు.
• కూటమి ప్రభుత్వ నిబద్ధత – పార్టీ పరంగా 34% రిజర్వేషన్లు:
2024 ఎన్నికల ప్రచారంలోనూ, ‘జయహో బీసీ’ సదస్సుల్లోనూ ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం జీవోలు ఇచ్చిందని గుర్తుచేశారు. రాష్ట్ర జనాభాలో 50 శాతానికి పైగా ఉన్న బీసీల అభ్యున్నతి కోసం కోర్టు తీర్పు ఎలాంటిదైనా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో (పంచాయతీలు, మండలాలు, జిల్లా పరిషత్తులు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు) తెలుగుదేశం పార్టీ తరఫున టికెట్ల కేటాయింపులో బీసీలకు ఖచ్చితంగా 34% స్థానాలు కేటాయించి తీరుతామని ఆయన స్పష్టం చేశారు.










