విశాఖపట్నం క్రీడా రంగానికి నయా జోష్: గోపాలపట్నంలో అత్యాధునిక స్పోర్ట్స్ కాంప్లెక్స్ ప్రారంభం

0
5

• రూ. 122.75 లక్షలతో అంతర్జాతీయ హంగులతో తీర్చిదిద్దిన జీవీఎంసీ

• ప్రారంభించిన ఎంపీ శ్రీభరత్, ప్రభుత్వ విప్ గణబాబు

• మైదానంలోకి దిగి పికిల్‌బాల్, వాలీబాల్ ఆడిన ప్రజాప్రతినిధులు

• క్రీడా మైదానాల అభివృద్ధిపై దిశానిర్దేశం చేసిన నేతలు

 

విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో క్రీడారంగానికి సరికొత్త జవజీవాలు చేకూరాయి. గోపాలపట్నం 92వ వార్డు పరిధిలోని చారిత్రాత్మక ఎస్.వి.ఎల్.ఎన్ (SVLN) జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో సుమారు రూ. 122.75 లక్షల జీవీఎంసీ సాధారణ నిధులతో అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దిన నూతన క్రీడా ప్రాంగణాన్ని విశాఖపట్నం ఎంపీ శ్రీ మతుకుమిల్లి శ్రీభరత్, ఏపీ ప్రభుత్వ విప్, పశ్చిమ ఎమ్మెల్యే శ్రీ పి.జి.వి.ఆర్. నాయుడు (గణబాబు) లాంఛనంగా ప్రారంభించారు.

 ఈ ప్రాంగణంలో అత్యాధునిక వాకింగ్ ట్రాక్, బాక్స్ క్రికెట్ కోర్టు, పికిల్‌బాల్ కోర్టు, వాలీబాల్ కోర్టు, బాల్ బ్యాడ్మింటన్ కోర్టులతో పాటు రాత్రి వేళల్లో సైతం క్రీడలు కొనసాగేందుకు హైమాస్ట్ లైటింగ్ వ్యవస్థను ప్రత్యేకంగా సిద్ధం చేశారు. ప్రారంభోత్సవం అనంతరం ఎంపీ శ్రీభరత్, ఎమ్మెల్యే గణబాబు మైదానంలోకి దిగి స్వయంగా స్థానిక క్రీడాకారులతో కలిసి బాల్ బాడ్మింటన్, పికిల్‌బాల్, వాలీబాల్ ఆడి యువతలో ఉత్సాహం నింపారు.

 

అంతర్జాతీయ ఛాంపియన్లను తయారు చేయడమే మా లక్ష్యం: ప్రభుత్వ విప్ గణబాబు

 

ఈ సందర్భంగా జరిగిన సభలో ప్రభుత్వ విప్ గణబాబు ప్రసంగిస్తూ మైదాన ప్రాముఖ్యతను వివరించారు:

• పాఠశాలతో అనుబంధం – వసతుల కల్పన: తాను చదువుకున్న గోపాలపట్నం హైస్కూలుతో తనకు విడదీయరాని అనుబంధం ఉందని గుర్తుచేశారు. ఇక్కడ బాక్సింగ్, బాల్ బ్యాడ్మింటన్, వాలీబాల్ కోర్టులు ఉండగా, బయట ఎంతో ఖరీదైన బాక్స్ క్రికెట్‌ను స్థానిక యువతకు ఉచితంగా అందుబాటులోకి తెచ్చామన్నారు. ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ అవుతున్న పికిల్‌బాల్ కోర్టును కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశామని చెప్పారు.

• ఎంపీ శ్రీభరత్ క్రీడా స్ఫూర్తి: ఎంపీ శ్రీభరత్‌కు పికిల్‌బాల్ అంటే ఎంతో మక్కువని, ఆయన ఢిల్లీ, హైదరాబాద్, వైజాగ్ ఎక్కడున్నా రాత్రి వేళల్లో సైతం పికిల్‌బాల్ ఆడుతూ నిజమైన స్పోర్ట్స్‌మ్యాన్ స్పిరిట్ చాటుకుంటారని ప్రశంసించారు. ప్రజాప్రతినిధులు మైదానంలో ఆడితే యువతకు మరింత స్ఫూర్తి కలుగుతుందన్నారు.

• మౌలిక వసతులు + కోచింగ్ + టోర్నమెంట్లు: “కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పించడంతోనే సరిపోదు. వసతులతో పాటు శిక్షణ ఇచ్చే కోచ్‌లు ఉండాలి, ఆడేందుకు ప్లేయర్లు రావాలి, నిరంతరం పోటీలు జరగాలి. స్కూల్ స్థాయి నుంచే (Early age) విద్యార్థులు ఆటల్లో రాణిస్తేనే జిల్లా, రాష్ట్ర, దేశానికి ప్రాతినిధ్యం వహించే జాతీయ, అంతర్జాతీయ ఛాంపియన్లు తయారవుతారు” అని పేర్కొన్నారు. భవిష్యత్‌లో ఇక్కడ మెగా టోర్నమెంట్లు నిర్వహిస్తామని తెలిపారు.

• శ్రీహరిపురంలో మరో ఇండోర్ స్టేడియం: గత ప్రభుత్వంలో నిలిచిపోయిన శ్రీహరిపురం ఇండోర్ స్టేడియం పనులను కూటమి ప్రభుత్వం పూర్తి చేసిందని, రేపు ఉదయం 11 గంటలకు దాన్ని కూడా ప్రజలకు అంకితం చేస్తామని వెల్లడించారు.

 

మైదానాలే ఆరోగ్యానికి రక్ష – శాస్త్రీయ నిర్మాణం ముఖ్యం: ఎంపీ శ్రీభరత్

 

విశాఖ ఎంపీ శ్రీభరత్ ప్రసంగిస్తూ స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆరోగ్య స్పృహపై మాట్లాడారు:

 

• 32 ఏళ్ల ప్రజాసేవ- క్రీడాభివృద్ధి: ఎమ్మెల్యే గణబాబు జెడ్పీటీసీగా, నాలుగుసార్లు ఎమ్మెల్యేగా దాదాపు 32 ఏళ్లుగా ఈ ప్రాంతంలో ప్రజాసేవ చేస్తూ, ఈ పాఠశాల మైదానాన్ని దశలవారీగా అద్భుతంగా అభివృద్ధి చేసుకుంటూ వచ్చారని కొనియాడారు.

• బేర్-ఫుట్ వాకింగ్ ట్రాక్ ఆలోచన: ఎప్పుడూ పాదరక్షలతో తిరగడం వల్ల భూమి నుంచి లభించే సహజ సిద్ధమైన ఎనర్జీ (Grounding) శరీరానికి అందడం లేదని, అందుకే పూర్వీకుల పద్ధతిలో పాదరక్షలు లేకుండా నడిచేలా (Bare-foot) రంపపు పొట్టు తదితర మిశ్రమంతో, వర్షం పడినా బురద కాకుండా శాస్త్రీయంగా 3 మీటర్ల వెడల్పుతో సరికొత్త వాకింగ్ ట్రాక్ రూపొందిస్తున్నారని వివరించారు.

• క్రీడా మైదాన నిర్మాణం వెనుక సైన్స్: చాలామంది గోడ కట్టి మట్టి పోస్తే మైదానం అనుకుంటారని, కానీ మైదాన నిర్మాణంలో ఎంతో సాంకేతికత (సైన్స్) దాగి ఉందన్నారు. వర్షపు నీరు నిలవకుండా 3 అడుగుల లోతులోనే శాస్త్రీయ పరిష్కారాలు చూపించడం ఒక క్రీడాకారుడైన ఎమ్మెల్యే గణబాబుకే సాధ్యమైందని ప్రశంసించారు.

• పికిల్‌బాల్ ప్రత్యేకత – ఆరోగ్యం: తాను గతంలో టెన్నిస్ ఆడేవాడినని, గాయాల వల్ల మానేసినప్పటికీ రెండేళ్ల క్రితం పికిల్‌బాల్‌తో మళ్లీ ఫిట్‌నెస్ సాధించానని చెప్పారు. ఒక టెన్నిస్ కోర్టు విస్తీర్ణంలో నాలుగు పికిల్‌బాల్ కోర్టులు వస్తాయని, ఇది ఖర్చు తక్కువతో ఎవరైనా సులభంగా నేర్చుకోగల ఆట అని పేర్కొన్నారు.

• ‘కూర్చోవడమే కొత్త క్యాన్సర్’: భారతదేశం మధుమేహ (డయాబెటిస్) రాజధానిగా మారిందని, ఎక్కువసేపు కదలకుండా కూర్చోవడమే సరికొత్త క్యాన్సర్‌గా (Sitting is the new cancer) వైద్యులు హెచ్చరిస్తున్నారని గుర్తుచేశారు. యువత ఫోన్లకు బానిసలు కాకుండా రోజూ గంట లేదా రెండు గంటలు మైదానాల్లో గడిపి శారీరక దృఢత్వం, ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. మైదానాల నాణ్యత కాపాడేందుకు స్వల్ప మెయింటెనెన్స్ విధానాన్ని స్థానికంగా తీసుకురావాలని సూచించారు.

 

ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి ప్రేమ్ కుమార్, విశాఖపట్నం జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి శ్రీమతి ఆర్. జూన్ గల్లియోట్ రోడ్రిగ్స్, ద్రోణాచార్య అవార్డు గ్రహీత వెంకటేశ్వరరావు, జోనల్ కమిషనర్ హేమవతి, జన సేన వెస్ట్ ఇంచార్ అంగ ప్రశాంతి, కూటమి పార్టీల ముఖ్య నాయకులు, జీవీఎంసీ అధికారులు, పాఠశాల ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు, యువ క్రీడాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అన్ని వసతులతో కూడిన క్రీడా ప్రాంగణం గోపాలపట్నంలో అందుబాటులోకి రావడం పట్ల స్థానికులు, వాకర్లు, క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేశారు