గోపాలపట్నంలోని శాసనసభ్యుల కార్యాలయంలో వివిధ బీసీ కులాల సంఘాల ముఖ్య నేతలతో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహణ.
• రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు పూర్తి రాజకీయ ప్రాధాన్యత కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టీకరణ.
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో బీసీ రిజర్వేషన్లపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న నిరాధార ఆరోపణలను, తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రభుత్వ విప్, విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే పి.జి.వి.ఆర్. నాయుడు (గణబాబు) అన్నారు. గోపాలపట్నంలోని తన కార్యాలయంలో వివిధ బీసీ కులాల సంఘాల ప్రతినిధులతో నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైకాపా ద్వంద్వ వైఖరిని ఎండగట్టారు.
• వైకాపా చేసిన చారిత్రక ద్రోహం : గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో 34 శాతం ఉన్న బీసీ రిజర్వేషన్లను 24 శాతానికి తగ్గించి, రాష్ట్రవ్యాప్తంగా సుమారు 16,000 మంది బీసీల స్థానిక నాయకత్వ అవకాశాలను తుంచేసింది జగన్మోహన్ రెడ్డి కాదా అని నిలదీశారు. నాడు 10 శాతం రిజర్వేషన్ కోత పెట్టి వేలాది మంది సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కార్పొరేటర్లు కాకుండా చేసిన వైకాపా నేతలు, నేడు ఏ మొహం పెట్టుకుని మాట్లాడుతున్నారని ప్రశ్నించారు.
• కోర్టుల పేరుతో కుట్రలు చేసింది వైకాపానే: టీడీపీ హయాంలో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జారీ చేసిన జీవోలపై కోర్టులకు వెళ్లి అడ్డుకుంది వైకాపా వ్యక్తులేనని గణబాబు గారు గుర్తుచేశారు. తాము చేసిన పాపాలను కూటమి ప్రభుత్వంపై నెట్టేందుకు వైకాపా స్క్రిప్ట్ చదువుతూ బీసీలను మభ్యపెట్టాలని చూస్తోందని మండిపడ్డారు.
• టీడీపీ బీసీల పక్షపాతి: స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత స్థానిక సంస్థల్లో బీసీలకు రాజకీయ గుర్తింపు తెచ్చింది దివంగత ఎన్టీఆర్ గారేనని, 1987లో 20 శాతం ఉన్న రిజర్వేషన్లను 1996లో చంద్రబాబు నాయుడు గారు 34 శాతానికి పెంచి కొనసాగించారని స్పష్టం చేశారు.
• శాస్త్రీయ విధానంలో రిజర్వేషన్ల సాధన: రాబోయే స్థానిక ఎన్నికల్లో రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ నివేదిక, ఎంపిరికల్ డేటా ఆధారంగా బీసీలకు న్యాయం చేసేందుకు కూటమి ప్రభుత్వం కేబినెట్లో నిర్ణయాలు తీసుకుంటోందని తెలిపారు. చట్టపరమైన నిబంధనల వల్ల ఎక్కడైనా శాతంలో వ్యత్యాసం వచ్చినా, పార్టీ తరఫున ఇచ్చే బీ-ఫారాలలో బీసీలకు పెద్దపీట వేసి 34 శాతానికి మించి రాజకీయ ప్రాతినిధ్యం కల్పిస్తామని భరోసా ఇచ్చారు.
విశాఖపట్నం, ఉత్తరాంధ్ర జిల్లాల్లో బీసీ జనాభా అధికంగా ఉన్నందున రిజర్వడ్ స్థానాలతో పాటు జనరల్ స్థానాల్లోనూ బీసీ నాయకులను గెలిపించే సత్తా కూటమికి ఉందని ధీమా వ్యక్తం చేశారు.
ఈ సమావేశంలో ఈత గీత కార్మిక శెట్టిబలిజ సంఘం, శాలి సంఘం, నాయి బ్రాహ్మణ సేవా సంఘం, రజక సంక్షేమ సంఘం, యాదవ సంఘం, గౌరీ (గవర) సంఘం, కొప్పుల వెలమ / వెలమ సంఘం, కళింగ సంక్షేమ సంఘం, నగరాల సంఘం, అగ్నికుల క్షత్రియ సంఘం, వడబలిజ సంఘం, కళింగ వైశ్య సంఘం, పద్మశాలి సంఘం, తూర్పు కాపు సంక్షేమ సంఘం, మత్స్యకార సంక్షేమ సంఘం, గౌడ సంఘం, విశ్వబ్రాహ్మణ (విశ్వకర్మ) సంఘం, వడ్డెర సంక్షేమ సంఘం మరియు శాలివాహన (కుమ్మరి) సంఘం ప్రతినిధులు, ప్రముఖ నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గణబాబు గారు మాట్లాడుతూ.. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల హక్కుల పరిరక్షణ కోసం సంఘాలన్నీ ఐక్యంగా ముందుకు సాగాలని, వైకాపా చేస్తున్న తప్పుడు ప్రచారాలను తిప్పికొడుతూ క్షేత్రస్థాయిలోకి వాస్తవాలను తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టిక్కెట్ల కేటాయింపుతో పాటు అన్ని రంగాల్లో బీసీలకు సముచిత న్యాయం జరిగేలా చూస్తామని, కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ బీసీలకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.










