నర్సీపట్నం శివపురంలో ఆదివారం నూతనంగా ఏర్పాటు చేసిన ‘శ్రీ లలిత హాస్పిటల్’ ను రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, ఆయన సతీమణి పద్మావతితో కలిసి రిబ్బన్ కట్ చేసి ఘనంగా ప్రారంభించారు. ఈ ఆసుపత్రిలో ‘ఆర్థో అండ్ స్పోర్ట్స్ కేర్’ తో పాటు ప్రత్యేకంగా ‘స్కిన్ మంత్ర’ విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రి వ్యవస్థాపకులు డాక్టర్ సూర్యనారాయణ, ఆయన సతీమణి డాక్టర్ శ్రీదేవి, వారి కుమారుడు డాక్టర్ హనుతేజ్, వారి కోడలు తదితర వైద్య బృందాన్ని స్పీకర్ ప్రత్యేకంగా అభినందించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రస్తుత రోజుల్లో ప్రజల్లో ఆరోగ్యపరమైన అవగాహన గణనీయంగా పెరిగిందని, మందులతో పనిలేకుండా ‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలని సూచించారు. గతంలో మెరుగైన వైద్యం కోసం విశాఖపట్నం వెళ్లాల్సిన పరిస్థితి ఉండేదని, కానీ నేడు నర్సీపట్నంలోనే సుమారు 40కి పైగా ప్రైవేట్ ఆసుపత్రులు అందుబాటులోకి వచ్చాయని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. విశాఖపట్నంలోని పెద్ద ఆసుపత్రులకు దీటుగా, ఫైవ్ స్టార్ స్థాయి సౌకర్యాలు, అత్యాధునిక వైద్య పరికరాలు ఇక్కడి ఆసుపత్రుల్లో, ముఖ్యంగా ఈ శ్రీ లలిత ఆసుపత్రిలోని ఆపరేషన్ థియేటర్లలో అందుబాటులో ఉండటం గర్వకారణమన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులను సైతం సమాంతరంగా అభివృద్ధి చేస్తున్నామని, ప్రజలు వైద్యం కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లి ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో సోమవారం చీడికాడలో కూడా నూతన ప్రభుత్వ ఆసుపత్రిని ప్రారంభించనున్నట్లు ఆయన వెల్లడించారు.
ఈ నూతన ఆసుపత్రిలో ఆర్థోపెడిక్ సేవలతో పాటు ప్రత్యేకంగా చర్మం, జుట్టు (హెయిర్ ట్రాన్స్ ప్లాంట్), లేజర్ చికిత్సల కోసం ‘స్కిన్ మంత్ర’ పేరుతో కాస్మోటాలజీ విభాగాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని స్పీకర్ పేర్కొన్నారు. ఈ అత్యాధునిక వైద్య సేవలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకొని ఆరోగ్యంగా ఉండాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రాజశేఖర్, జాలమురి బంగారు రాజు స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.










