మేయర్ పీఠాలపై కూటమిలో కసరత్తు.. నేడు భేటీ.

0
1

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలకు కూటమి పార్టీలు సిద్ధమవుతున్నాయి. రాష్ట్రంలోని 17 నగరపాలక సంస్థల మేయర్ స్థానాల పంపకాలపై తెలుగుదేశం, జనసేన, బీజేపీల మధ్య చర్చలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకునేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర నాయకుడు పీవీఎన్ మాధవ్ ఈ రోజు సాయంత్రం సమావేశం కానున్నారు.

 

ప్రాథమిక సమాచారం ప్రకారం, జనసేన పార్టీ నాలుగు మేయర్ స్థానాలను ఆశిస్తుండగా, మూడు స్థానాలు కేటాయించేందుకు కూటమిలో సానుకూలత వ్యక్తమవుతోంది. విజయవాడ, మచిలీపట్నం, కాకినాడ నగరపాలక సంస్థలను జనసేనకు కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా, తిరుపతి మేయర్ పీఠాన్ని బీజేపీకి కేటాయించే అంశంపై చర్చలు దాదాపు తుది దశకు చేరుకున్నాయి. మిగిలిన స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు బరిలోకి దిగే అవకాశముంది.