Tirumala: తిరుమల బ్రహ్మోత్సవాల్లో 4వ రోజు రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాలస్వామి అలంకారంలో మలయప్ప స్వామి సర్వభూపాల వాహనంపై దర్శనమిచ్చారు.

0
1

Tirumala: తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు గురువారం రాత్రి శ్రీ మలయప్ప స్వామివారు రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాలస్వామి అలంకారంలో సర్వభూపాల వాహనంపై భక్తులకు అభయమిచ్చారు. రాత్రి నాలుగు మాడ వీధుల్లో ఈ వాహనసేవ నేత్రపర్వంగా సాగింది. వాహనసేవకు ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తబృందాల చెక్కభజనలు, జీయ్యంగార్ల దివ్య గోష్టి, మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపు అంగరంగ వైభవంగా జరిగింది. అడుగడుగునా భక్తులు కర్పూర హారతులు సమర్పిస్తూ, గోవింద నామస్మరణతో స్వామివారిని దర్శించుకుని తరించారు. ఓ వైపు చిరుజల్లులు కురుస్తున్నా శ్రీవారి భక్తుల భక్తిభావంతో తిరుమల మాడ వీధులు పూర్తిగా పరవశించిపోయాయి.