● పదేళ్లపాటు ఆర్థిక సహకారానికి ముందుకొచ్చిన స్పాన్సర్
● 40–45 రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమం ప్రారంభించే లక్ష్యం
అల్వాల్, నవంబర్ 6: తెలంగాణ పోలీస్ సిబ్బంది ఆరోగ్యం, సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ రూపొందించిన ఫిట్కాప్ (FitCop) కార్యక్రమాన్ని రాష్ట్ర పోలీస్ శాఖలోని అన్ని విభాగాలు, యూనిట్లకు విస్తరించేందుకు డీజీపీ సి.వి. ఆనంద్ చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమం అమలుపై యాప్ డెవలపర్లు, సాంకేతిక నిపుణులు, ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.
● 90 వేల మంది సిబ్బందికి ఆరోగ్య పరీక్షలు
రాష్ట్రవ్యాప్తంగా సుమారు 90 వేల మంది పోలీస్ సిబ్బందికి బాడీ మాస్ ఇండెక్స్ (BMI), ఎత్తు, బరువు, రక్తపోటు, మధుమేహ పరీక్షలు నిర్వహించి, వాటి వివరాలను యాప్లో నమోదు చేయనున్నారు. ఆరోగ్యపరంగా అధిక ముప్పు ఉన్నవారిని గుర్తించి, కాల్ సెంటర్ ద్వారా వైద్యులు ఫోన్లో సంప్రదిస్తారు. అవసరమైన వైద్య సూచనలు అందించడంతో పాటు వారి ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తారు.
● మానసిక ఆరోగ్యానికీ ప్రాధాన్యత
ఫిట్కాప్లో మానసిక ఆరోగ్య సంరక్షణ, వ్యక్తిగత ఆహార ప్రణాళికలు, వ్యాయామ సూచనలు, సమగ్ర ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. పోలీస్ సిబ్బందికి అవసరమైన ఆరోగ్య ప్రమాణాలు, యాప్లో పొందుపరచాల్సిన ప్రత్యేక సదుపాయాలపై సమావేశంలో చర్చించారు.
● పదేళ్లపాటు ఆర్థిక సహకారం
ఈ కార్యక్రమానికి రానున్న పదేళ్లపాటు పూర్తి ఆర్థిక సహకారం అందించేందుకు ఓ స్పాన్సర్ ముందుకొచ్చారు. అవగాహన ఒప్పందం (MoU), యాప్ ప్రారంభం అనంతరం అమలు చేయాల్సిన కార్యాచరణ ప్రణాళికపై అధికారులు చర్చించారు. మరో 40–45 రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాన్ని ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
పోలీస్ సిబ్బంది ఆరోగ్యాన్ని పర్యవేక్షించడంతోపాటు ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకునేలా ప్రోత్సహించడం, తద్వారా విధి నిర్వహణలో మరింత సమర్థవంతంగా పనిచేసేలా చేయడమే ఫిట్కాప్ ప్రధాన ఉద్దేశమని డీజీపీ సి.వి. ఆనంద్ పేర్కొన్నారు.
#Sidhumaroju
Alwal










