నకిలీ ఐఫోన్ల దందా.. ఒకరి అరెస్ట్.|

0
6

● ఒరిజినల్ అంటూ క్లోన్ వస్తువుల విక్రయాలతో మోసం

● రెండు ఐఫోన్లు, నాలుగు ఆపిల్ వాచీలు, ఏడు ఇయర్‌బడ్స్ స్వాధీనం

● మరో నిందితుడు పరారీ.. గాలిస్తున్న పోలీసులు

అల్వాల్, నవంబర్ 7: నకిలీ ఎలక్ట్రానిక్ వస్తువులను ఒరిజినల్ ఉత్పత్తులుగా నమ్మించి విక్రయిస్తూ ప్రజలను మోసం చేస్తున్న వ్యక్తిని సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేశారు.

ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ జిల్లా మురాద్‌నగర్‌కు చెందిన అల్తమాష్ (26) ప్రస్తుతం హైదరాబాద్ మలక్‌పేట్‌లోని సైద్‌నగర్‌లో నివాసం ఉంటూ ఈ మోసాలకు పాల్పడుతున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది.

నకిలీ, క్లోన్ చేసిన ఐఫోన్లు, ఆపిల్ వాచీలు, ఇయర్‌బడ్స్‌ను అసలైన ఉత్పత్తులుగా నమ్మించి అమాయక వినియోగదారులకు విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడి వద్ద నుంచి రెండు ఐఫోన్లు, నాలుగు నకిలీ ఆపిల్ వాచీలు, ఏడు నకిలీ ఇయర్‌బడ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న రెండు ఐఫోన్లలో ఒకటి నకిలీదిగా గుర్తించారు.

ఈ మోసాల వెనుక ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన ఆవైస్ ఖాన్ అనే మరో వ్యక్తి ప్రమేయం ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. ప్రస్తుతం అతను పరారీలో ఉండటంతో పోలీసులు గాలింపు చేపట్టారు.

క్రైమ్ నంబర్ 1267/2026 కింద రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. మాదాపూర్ డివిజన్ ఏసీపీ మార్గదర్శకత్వంలో, రాయదుర్గం ఎస్‌హెచ్‌ఓ పర్యవేక్షణలో డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ కె. రామిరెడ్డి తన క్రైమ్ బృందంతో కలిసి కేసును దర్యాప్తు చేసి నిందితుడిని పట్టుకున్నారు. నవంబర్ 7న అరెస్టు చేసిన అల్తమాష్‌ను న్యాయస్థానంలో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.

#Sidhumaroju

Alwal