క్యాంటీన్ మద్యం అక్రమ దందా.. ఇద్దరు మహిళలు అరెస్ట్.|

0
2

 

● 163 డిఫెన్స్ మద్యం బాటిళ్లు స్వాధీనం.. రూ.2.11 లక్షల విలువైన మద్యం పట్టివేత

● క్యాంటీన్ కోటా దుర్వినియోగం.. ఇద్దరు మహిళల అరెస్ట్

● లోతుకుంట, న్యూ బోయిన్‌పల్లిలో ఎక్సైజ్ అధికారుల దాడులు

అల్వాల్, నవంబర్ 7: మాజీ సైనికులకు రక్షణ శాఖ క్యాంటీన్ల ద్వారా రాయితీపై అందించే మద్యాన్ని అక్రమంగా బయట విక్రయిస్తున్న వ్యవహారం వెలుగులోకి వచ్చింది. క్యాంటీన్ కోటా ద్వారా తక్కువ ధరకు మద్యం సేకరించి, అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు గుర్తించిన ఎక్సైజ్ అధికారులు రెండు ప్రాంతాల్లో వేర్వేరుగా దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో మొత్తం 163 డిఫెన్స్ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.2.11 లక్షలుగా అంచనా వేశారు.

మల్కాజిగిరి ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అసిస్టెంట్ కమిషనర్ ప్రదీప్ రావు నేతృత్వంలోని బృందం లోతుకుంటలోని సరస్వతీనగర్‌లో మన్యం నాగప్రసన్న, ఆమె భర్త రామాంజనేయులు నివాసంలో తనిఖీలు నిర్వహించింది. ఈ సోదాల్లో 96 డిఫెన్స్ మద్యం బాటిళ్లు పట్టుబడ్డాయి. మాజీ సైనికుడైన రామాంజనేయులు తన క్యాంటీన్ కోటాతో పాటు ఇతర అర్హుల కోటాల ద్వారా మద్యం సేకరిస్తుండగా, ఆయన భార్య నాగప్రసన్న ఇంటి నుంచే బయటి వ్యక్తులకు విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. 

ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసిన అధికారులు నాగప్రసన్నను అరెస్ట్ చేసి అల్వాల్ ఎక్సైజ్ స్టేషన్‌కు అప్పగించారు.

మరోవైపు ఎక్సైజ్ స్టేట్ టాస్క్‌ఫోర్స్ టీమ్-బి సీఐ గణపతిరెడ్డి నేతృత్వంలోని బృందం న్యూ బోయిన్‌పల్లిలోని సౌజన్య కాలనీలో ముసిమి లెంక (39) నివాసంపై దాడి చేసింది.

ఈ తనిఖీల్లో 67 డిఫెన్స్ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా మద్యం విక్రయిస్తున్నట్లు గుర్తించిన అధికారులు ఆమెను అరెస్ట్ చేశారు.

రెండు వేర్వేరు దాడుల్లో మొత్తం 163 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్న ఎక్సైజ్ అధికారులు, డిఫెన్స్ క్యాంటీన్ కోటాను దుర్వినియోగం చేస్తూ అక్రమ విక్రయాలకు పాల్పడుతున్న ఇతరుల పాత్రపైనా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

#Sidhumaroju

Alwal