మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి అత్యాధునిక అంబులెన్సులు

0
3

మంచిర్యాల: ప్రజలకు మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి మరో రెండు అత్యాధునిక అంబులెన్సులు అందుబాటులోకి వచ్చాయి. డీఎంఎస్టీ నిధుల ద్వారా రూ.20 లక్షల వ్యయంతో నూతనంగా కొనుగోలు చేసిన రెండు అంబులెన్సులను మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్‌తో కలిసి మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు జెండా ఊపి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ.. మారుమూల గ్రామీణ ప్రాంతాల ప్రజలకు సైతం సత్వర వైద్య సేవలు అందించడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. అత్యవసర సమయాల్లో రోగులను త్వరితగతిన ఆసుపత్రులకు తరలించేందుకు ఈ అత్యాధునిక అంబులెన్సులు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు.

మంచిర్యాల నియోజకవర్గంలో వైద్య రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు దశలవారీగా చర్యలు చేపడుతున్నామని, ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యాధునిక వెంటిలేటర్లు, ఇతర వైద్య పరికరాలను అందుబాటులోకి తీసుకొస్తున్నామని వెల్లడించారు. స్థానిక ప్రజలు అత్యవసర వైద్య చికిత్సల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా రాబోయే ఏడాదిలోగా అన్ని రకాల సంపూర్ణ వైద్య సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

ప్రజారోగ్యమే ప్రాధాన్యంగా..

ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు అత్యవసర వైద్య సేవలను మెరుగుపరచడం ద్వారా సామాన్య ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అన్వేష్, టీపీసీసీ ఉపాధ్యక్షులు చిట్ల సత్యనారాయణ, మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య మహేష్, కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కార్పొరేటర్ తూముల నరేష్, మంచిర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ రామగిరి బానేష్, కార్పొరేటర్లు, కో-ఆప్షన్ సభ్యులు, ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.