● విద్యార్థులకు రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన
● హెల్మెట్, సీట్ బెల్ట్ వినియోగంపై అధికారుల సూచనలు
● కుటుంబ సభ్యులకూ ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించాలని పిలుపు
అల్వాల్, నవంబర్ 16: మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బి. సుమతి, ఐపీఎస్ ఆదేశాల మేరకు, ట్రాఫిక్ డీసీపీ-1 కె. రాహుల్ రెడ్డి, ఐపీఎస్ పర్యవేక్షణలో తిరుమలగిరిలోని హోలీ ఫ్యామిలీ హైస్కూల్లో ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
తిరుమలగిరి ట్రాఫిక్ ఏసీపీ జి. శంకర్ రాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులకు రోడ్డు భద్రతా నియమాలు, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కార్లలో ప్రయాణించేవారు సీట్ బెల్ట్ పెట్టుకోవాలని, ట్రాఫిక్ సిగ్నళ్లను పాటించాలని సూచించారు. జీబ్రా క్రాసింగ్ వద్దే రోడ్డు దాటాలని, పాదచారులు ఫుట్‌పాత్‌లను వినియోగించాలని వివరించారు.
అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్, మద్యం సేవించి వాహనాలు నడపడం, డ్రైవింగ్ సమయంలో సెల్‌ఫోన్ వినియోగం, ట్రిపుల్ రైడింగ్ వల్ల జరిగే ప్రమాదాల గురించి విద్యార్థులకు వివరించారు. చిన్న వయస్సు నుంచే ట్రాఫిక్ నియమాలను అలవాటు చేసుకోవడంతో పాటు, తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులకు కూడా వాటిపై అవగాహన కల్పించాలని సూచించారు.
రోడ్డు భద్రతపై అవగాహన బాల్యం నుంచే ప్రారంభం కావాలని, పిల్లలు తమ కుటుంబ సభ్యులు ట్రాఫిక్ నిబంధనలు పాటించేలా ప్రేరేపించాలని అధికారులు పేర్కొన్నారు. తిరుమలగిరి డివిజన్ పరిధిలోని పాఠశాలలు, కళాశాలలు, కార్పొరేట్ సంస్థల్లో ఇలాంటి అవగాహన కార్యక్రమాలను కొనసాగిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ సిస్టర్ నిర్మల, తిరుమలగిరి ట్రాఫిక్ ఎస్హెచ్ఓ వి. సర్దార్ నాయక్, ఆర్ఐ రమణయ్య, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
#Sidhumaroju
Alwal









