రూ.40 లక్షల హషీష్ ఆయిల్ పట్టివేత.. ముగ్గురు అరెస్ట్ |

0
11

● 3.180 కేజీల మాదకద్రవ్యం స్వాధీనం.. ముగ్గురు నిందితుల అరెస్ట్

● ఎస్ఓటీ ఉప్పల్ జోన్, నాచారం పోలీసుల సంయుక్త ఆపరేషన్

● ప్రధాన సరఫరాదారు వెంకట్ పరారీ.. కొనసాగుతున్న గాలింపు

అల్వాల్,నవంబర్17:అక్రమంగా హషీష్ ఆయిల్ రవాణా చేస్తున్న ముఠాపై ఎస్ఓటీ ఉప్పల్ జోన్ బృందం, నాచారం పోలీసులు సంయుక్తంగా దాడి చేసి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. నవంబర్ 16న ఐడీఏ నాచారం ప్రాంతంలో ఈ ఆపరేషన్ నిర్వహించి నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

 

● రూ.40 లక్షల విలువైన డ్రగ్స్ స్వాధీనం

నిందితుల నుంచి 3.180 కేజీల హషీష్ ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ.40 లక్షలుగా అంచనా వేశారు. వీటితో పాటు మూడు మొబైల్ ఫోన్లు, నేరానికి ఉపయోగించిన టీవీఎస్ జూపిటర్ స్కూటర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

 

● ప్రధాన సరఫరాదారు కోసం గాలింపు

ఈ వ్యవహారంలో ప్రధాన సరఫరాదారుగా భావిస్తున్న వెంకట్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అతని ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. హషీష్ ఆయిల్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, సరఫరా వెనుక ఉన్న నెట్‌వర్క్‌లో ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉందనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ ఘటనపై నాచారం పోలీస్ స్టేషన్‌లో ఎన్‌డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేశారు.

 

● సీపీ పర్యవేక్షణలో ఆపరేషన్

మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బి. సుమతి, ఐపీఎస్ పర్యవేక్షణలో, ఉన్నతాధికారుల మార్గదర్శకత్వంతో ఎస్ఓటీ ఉప్పల్ జోన్, నాచారం పోలీసు బృందాలు ఈ ఆపరేషన్ నిర్వహించాయి. కమిషనరేట్ పరిధిలో మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలను అరికట్టి డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి చర్యలు చేపడుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని, మాదకద్రవ్యాల బారిన పడకుండా యువతను కాపాడాలని పోలీసులు పిలుపునిచ్చారు.

#Sidhumaroju

Alwal